'ప్యారడైజ్' టికెట్ ధరల పెంపు మెమోను.. వెనక్కి తీసుకోండి! హైకోర్టు.. కీలక ఆదేశాలు
ABN, Publish Date - Sep 23 , 2026 | 06:18 AM
'ప్యారడైజ్' టికెట్ ధరల పెంపు మెమోను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నాని (Nani) నటించిన 'ది ప్యారడైజ్ (the paradise) సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ప్రీమియర్ షో ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ఈనెల 20న జారీ చేసిన మెమోను పునః పరిశీలించి వెనక్కు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఐపీఎస్ శిఖా గోయెల్‌కు హైకోర్టు (High Court for the State of Telangana) ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 14న జీవో నంబర్ 77 జారీ చేసిందని, అందులో ఉన్న షరతులు 8, 9, 10, 11లకు విరుద్ధంగా ప్రస్తుత మెమో ఉందని ధర్మాసనం తప్పుబట్టింది. నూతన జీవో ప్రకారం రూ.100 కోట్లకుపైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు, అది కూడా కార్మికుల సంక్షేమానికి నిధులు డిపాజిట్ చేస్తేనే రేట్ హైక్ ఇవ్వాలని షరతులు ఉన్నాయని, వాటిని పాటించినట్లు ఆధారాలు ఏవీ లేకుండానే 'ది ప్యారడైజ్' సినిమాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేసింది,
ఈనెల 24న విడుదల కానున్న 'ది ప్యారడైజ్' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, టికెట్ ఒక్కింటికి రూ.500 చొప్పున ఈనెల 23వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. హైకోర్టు గత ఉత్త ర్వులకు విరుద్ధంగా దీనిని జారీ చేశారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటే చట్ట ప్రకారం సినిమా విడుదలకు 90 రోజుల ముందే సదరు ప్రతిపాదనను పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది.
కానీ, చివరి నిమిషంలో సినిమా రేట్లు పెంచుకోవడానికి అవ కాశం ఇస్తూ మెమోలు ఇస్తున్నారని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేలోపే టికెట్లు మొత్తం అమ్మేస్తున్నారని.. ఈ ప్రక్రియను ఏడాదిగా వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి గత ఉత్తర్వులను ఉల్లంఘించారని ధర్మాసనం అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తూనే. తదు పరి విచారణను అక్టోబరు 6కు వాయిదా వేసింది.
ఏపీలోనూ..
'ది ప్యార డైజ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 23న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం.. ప్రీమియర్ షో టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ రూ.400, సింగిల్ స్క్రీన్‌లో రూ.300కు విక్రయించుకోవచ్చు. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3 వరకూ పది రోజులపాటు ప్రస్తుత టికెట్ ధరపై మల్టీప్లెక్స్ లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకోవచ్చు. పది రోజుల వరకూ ప్రతి రోజూ ఐదు షోల ప్రదర్శనకు హోం శాఖ వెసులుబాటు కల్పించింది.