థియేటర్లు ఊగిపోతయ్.. ఇది జడల్ గాని వాదా
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:54 AM
‘నమ్మకంతో చెబుతున్నా.. సెప్టెంబరు 23న సాయంత్రం థియేటర్లు ఊగిపొతయ్. ఇది ‘ప్యారడైజ్’ టీమ్ వాదా. ఈ జడల్ గాని వాదా’ అని అన్నారు హీరో నాని
‘నమ్మకంతో చెబుతున్నా.. సెప్టెంబరు 23న సాయంత్రం థియేటర్లు ఊగిపొతయ్. ఇది ‘ప్యారడైజ్’ టీమ్ వాదా. ఈ జడల్ గాని వాదా’ అని అన్నారు హీరో నాని (Nani). ఆయన కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (the paradise). కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయిక. మోహన్‌బాబు, రాఘవ్ జ్యుయెల్, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
సినిమా ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ ‘శ్రీకాంత్‌కు నాకు మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధం. రాఘవ్ జ్యుయెల్ లాంటి విలన్‌ను ఇప్పటి వరకూ చూసి ఉండరు. ‘సమ్మక్క’ పాత్రను సోనాలి కులకర్ణి తప్ప మిగతా ఏవరూ చేసి ఉండేవారు కాదు. మోహన్‌బాబు గారు ఏంటో నేటి తరానికి ‘ప్యారడైజ్’ గుర్తు చేస్తుంది. అనిరుధ్ ప్రాణం పెట్టి చేసిన చిత్రమిదని ఆయన అన్నారు.
‘సమ్మక్క’ పాటలో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఆ పాటను చూసిన ప్రతీసారి నా గుండె బరువెక్కింది. ఆ పాటను కాసర్ల శ్యామ్ అంత అద్భుతంగా రాశారు’ అని అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఆల్‌రెడీ ఇది బ్లాక్‌బస్టర్ అయిపోయింది. శ్రీకాంత్‌కు తెలంగాణ మీద చాలా పట్టుంది. అందుకే ‘ప్యారడైజ్’ ప్రపంచాన్ని సృష్టించగలిగాడు’ అని అన్నారు. కయాదు లోహర్ మాట్లాడుతూ ‘24న జడల్ జమానా షూరూ అవుతుంది’ అని అన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, వై.రవిశంకర్, నవీన్ యెర్నేని, గీత రచయిత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.