‘వారణాసి’ నుంచి బిగ్ లీక్..

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:57 AM

వారణాసి షూటింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.

Varanasi

భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (maheshbabu) కలయికలో వస్తున్న చిత్రం వారణాసి (Varanasi). గ్లోబల్ బాక్సాఫీస్ టార్గెట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగానే కాదు, హాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమా గురించిన చిన్న అప్‌డేట్ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా వెళ్లిపోతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడమే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.

ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి తన పక్కా ప్లానింగ్‌తో ప్రతి ఫ్రేమ్‌ను ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబుకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ ఈ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిగా ముగియనుంది. ఆ తర్వాత ప్యాచ్ వర్క్, ఇతర నటీనటులపై తీయాల్సిన సీన్లను చిత్రీకరించి, మొత్తం టాకీ పార్ట్‌ను అక్టోబర్ మూడో వారం నాటికి పూర్తి చేసేలా చిత్రబృందం పక్కా షెడ్యూల్ సిద్ధం చేసింది. అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలనేది జక్కన్న ప్లాన్.

ఇక కథ విషయానికి వస్తే, ఇందులో మహేష్ బాబు గతంలో ఎన్నడూ చూడని రీతిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి ‘రుద్ర’ కాగా, మరొకటి ‘శ్రీరాముడు’. ఈ ద్విపాత్రాభినయం సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మరోవైపు హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక ‘మందాకిని’ అనే చాలా బరువైన, ప్రాధాన్యత ఉన్న పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ విజువల్ వండర్‌ను దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా కళ్లు చెదిరే బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణతో పాటు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ గ్లింప్స్‌కు దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

సాంకేతికంగా కూడా ఈ ప్రాజెక్ట్ అత్యున్నత ప్రమాణాలతో సిద్ధమవుతోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా కోసం 6 అద్భుతమైన పాటలను ఆయన సిద్ధం చేశారు. అంతేకాదు, ఈ సెప్టెంబర్ నుంచే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను కూడా అధికారికంగా ప్రారంభించనున్నారు.

కథ, స్క్రీన్‌ప్లేను లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించగా, డైలాగ్స్ బాధ్యతను పవర్‌ఫుల్ రైటర్, డైరెక్టర్ దేవా కట్టా తీసుకున్నారు. దేవా కట్టా రాసిన సంభాషణలు థియేటర్లలో రోమాంచితమైన అనుభూతిని ఇవ్వబోతున్నాయని టాక్. టాప్ టెక్నీషియన్లు, వరల్డ్ క్లాస్ విజువల్స్, మహేష్ బాబు కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని సరికొత్త క్యారెక్టరైజేషన్.. వెరసి ‘వారణాసి’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రుద్ర లుక్‌ బయటకు రాగా, ‘శ్రీరాముడి’గా మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్‌ చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 22 , 2026 | 09:26 AM