'రాకా' సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్ డిజప్పాయింట్?
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:35 PM
అట్లీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాకా అప్‌డేట్‌పై అల్లు అర్జున్ అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించిన మేకర్స్, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ చూపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun), సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (atlee) కాంబినేషన్‌లో వస్తున్న రాకా (raaka) ఒకటి. దీపికా పదుకొణెతో పాటు, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడం, అటు జవాన్ తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అట్లీ దీనికి దర్శకుడు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక విలువలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో సైతం కొన్ని రోజులుగా ఈ బర్త్‌డే స్పెషల్ ట్రీట్ గురించే పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ మాత్రం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, కాస్త నిరాశకు కూడా గురిచేసింది. ఈ సినిమా కోసం ఏకంగా 37 మంది మోషన్ క్యాప్చర్ (Mo-Cap) ఆర్టిస్టులు ఏకకాలంలో పనిచేశారని, ఇది ప్రపంచంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ సాధించిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం భారతీయ సినిమాలో ఇలాంటి భారీ టెక్నాలజీని ఉపయోగించడం కచ్చితంగా గర్వించదగ్గ విషయమే.
టెక్నికల్ పరంగా చూస్తే ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే ప్రయత్నమిది. అయితే సాధారణ ప్రేక్షకులకు, ముఖ్యంగా మాస్ పల్స్ తెలిసిన బన్నీ అభిమానులకు మాత్రం ఈ రికార్డుల కంటే తెరపై తమ హీరో ఎలా కనిపించబోతున్నాడన్నదే ముఖ్యం. కనీసం ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్, పోస్టర్ లేదా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రివీల్ అవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు ఈ మోక్యాప్ రికార్డు ప్రకటన ఒకింత అసంతృప్తినే మిగిల్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే మేకర్స్ ఒక మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీనితో ఫ్యాన్స్‌లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో వచ్చిన ఈ వీడియోలో అసలు సినిమా నేపథ్యం ఏమిటి, తెరవెనుక ఎలాంటి మాయాజాలం జరుగుతోందో చూపించారు.
కానీ మొత్తం నాలుగు నిమిషాల వీడియో పూర్తయ్యే వరకు కేవలం టెక్నీషియన్ల హడావుడి, సెట్స్, కెమెరా వెనుక వర్క్ మాత్రమే కనిపించింది తప్ప.. చివరి క్షణంలో కూడా ఒక్కటంటే ఒక్క విజువల్ అవుట్‌పుట్ షాట్ కూడా చూపించలేదు. కనీసం లాస్ట్ ఫ్రేమ్‌లోనైనా బన్నీ క్యారెక్టర్‌కు సంబంధించిన చిన్న విజువల్ బిట్‌ను యాడ్ చేసి ఉంటే అభిమానుల ఉత్సాహం వేరే లెవల్లో ఉండేది. ఎలాంటి విజువల్ సర్‌ప్రైజ్ లేకుండా వీడియో ముగియడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమే, కానీ బర్త్‌డే స్పెషల్‌గా మేము కోరుకున్నది హీరో విజువల్ ట్రీట్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అట్లీ లాంటి కమర్షియల్ డైరెక్టర్ నుండి ఇలాంటి ప్యూర్ టెక్నికల్ అప్‌డేట్ మాత్రమే రావడం ఎవరూ ఊహించలేదు. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ ఎంత భారీ స్థాయిలో రూపొందుతోందో ఈ మేకింగ్ వీడియో స్పష్టం చేసింది. ఇక తదుపరి అప్‌డేట్‌లోనైనా మేకర్స్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఒక అదిరిపోయే టీజర్ లేదా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో వస్తారేమో వేచి చూడాలి.