ఆస్కార్ రేసులో మరో.. భారతీయ సినిమా
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:23 PM
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరి కోసం మనదేశం నుంచి అధికారికంగా మరాఠి చిత్రం ‘గోంధల్’ను ఎంపిక చేసిన విషయం విదితమే.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరి కోసం మనదేశం నుంచి అధికారికంగా మరాఠి (Marathi) చిత్రం ‘గోంధల్’ (Gondhal) ను ఎంపిక చేసిన విషయం విదితమే. ఇప్పుడు మరో సినిమా కూడా మనదేశం నుంచి ఆస్కార్ ( 99th Academy Awards Oscars 2027 ) రేసులో నిలవడం విశేషం. అదే నాగాలాండ్‌కు చెందిన ‘ఆంఘ్’ (Angh ) సినిమా.
వాస్తవానికి ఆస్కార్ ఎంట్రీ కోసం ఫిల్మ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కమిటీ ఫైనలైజ్ చేసిన తుది జాబితాలోని మూడు చిత్రాల్లో మరాఠీ సినిమా ‘గోంధల్’తో పాటు ‘ఆంఘ్’ కూడా ఉంది. కానీ మనదేశంలో విడుదల కాకపోవడంతో ‘ఆంఘ్’ సినిమాను కమిటీ పక్కన పెట్టింది.
అయితేనేం.. ఈ చిత్రానికి మరో రకంగా న్యాయం జరిగింది. థేజా రియో (Theja Rio) అనే కొత్త దర్శకుడు నాగాలాండ్ (Nagaland) లో 1960ల నాటి నేపథ్యంలో రూపొందించిన ‘ఆంఘ్’ చిత్రం టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ (2026)లో పాల్గొని ఫ్లాట్‌ఫామ్ ప్రైజ్ సొంతం చేసుకుంది. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లు టోరొంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజేతగా నిలవడం వల్ల ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫిల్మ్ కేటగిరిలో పరిశీలన కోసం ఎంపికయ్యే అర్హతను ‘ఆంఘ్’ నేరుగా సంపాదించుకుంది.
ఆయా దేశాల నుంచి అధికారికంగా ఎంపిక చేసిన చిత్రాలే కాకుండా ఆస్కార్ అకాడెమీ గుర్తింపు పొందిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు పొందిన సినిమాలు కూడా నేరుగా పోటీకి అర్హత సంపాదిస్తాయి. ఈ ఏడాది నుంచి ఆస్కార్ కమిటీ ప్రవేశ పెట్టిన ఈ కొత్త నిబంధన ‘ఆంఘ్’కు అలా కలసి వచ్చింది.