'బరి' లోకి దిగిన వరుణ్ తేజ్.. సుకుమార్ రైటింగ్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్
ABN, Publish Date - Sep 22 , 2026 | 04:04 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లైనప్ చూస్తుంటే టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.
వరుస పరాజయాల తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej), ఈ ఏడాది కొరియన్ కనకరాజుతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థియేటర్లలో సందడి చేసి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన వరుణ్, ఇప్పుడు తన కెరీర్‌ను మరింత వేగంగా, పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తుంటే టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ తన చెల్లెలు నిహారిక కొణిదెల సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో రూపొందుతున్న ‘బరి’ చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను ఘనంగా చాటుకున్న యదువంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా బరి తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
‘బరి’ సెట్స్‌పై ఉండగానే, వరుణ్ తేజ్ ఖాతాలో మరో రెండు ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టులు చేరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. అందులో మొదటిది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో రానున్న ప్రాజెక్ట్. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తీక్ సుబ్బరాజు తెలుగులో ఒక డిఫరెంట్ క్రైమ్ లేదా గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, అందులో వరుణ్ తేజ్ లీడ్ రోల్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సరికొత్త స్క్రీన్‌ప్లే, విభిన్నమైన టేకింగ్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
దీనికితోడు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు కమర్షియల్ సక్సెస్‌లను అందించడంలో సుకుమార్ రైటింగ్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ బ్యానర్‌లో రూపొందే కథలు ఎంత సహజంగా, గ్రిప్పింగ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుణ్ తేజ్ కోసం కూడా ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామాను సిద్ధం చేసినట్లు వినికిడి.
ఫిలింనగర్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం నడుస్తున్న ‘బరి’ పూర్తయిన వెంటనే సుకుమార్ రైటింగ్స్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి కథ, దర్శకత్వం వహించబోయే దర్శకుడు ఎవరు అనే విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది. సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఒక ప్రతిభావంతుడైన యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నట్లు ఇన్‌సైడ్ టాక్.
గతంలో ప్రయోగాలకు పెద్దపీట వేసిన వరుణ్ తేజ్, ఇప్పుడు కమర్షియల్ హంగులతో పాటు కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను భారీగా పెంచుకునే పనిలో పడ్డారు. యదువంశీ ‘బరి’, కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలోని ప్రాజెక్ట్, సుకుమార్ రైటింగ్స్ సినిమా.. ఇలా ఒకదానిని మించి మరొకటి ఉన్న ఈ లైనప్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయి.