టాలీవుడ్‌లో కొత్త పవర్‌ఫుల్ కాంబో? ‘ఓజీ’ డైరెక్టర్‌తో.. రామ్ చరణ్ సినిమా?
ABN, Publish Date - Sep 23 , 2026 | 08:13 AM
సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో జతకడతారు అనే విషయంపై ఇప్పటివరకు సరైన స్పష్టత లేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ ఏడాది ‘పెద్ది’ (Peddi) సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ తర్వాతి చిత్రం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో ఉండబోతోందనే సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీని ఏ రేంజ్‌లో షేక్ చేసిందో చూశాం. అందుకే, ఇప్పుడు రాబోతున్న ‘RC17’ పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే, సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో జతకడతారు అనే విషయంపై ఇప్పటివరకు సరైన స్పష్టత లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చరణ్ లైనప్‌లో తర్వాతి స్థానం ఎవరిదనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో చరణ్ కాల్షీట్లలో గ్యాప్ ఉందేమో అనుకుంటున్న సమయంలో, ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
రామ్ చరణ్ లైనప్‌లోకి ఒక క్రేజీ యంగ్ డైరెక్టర్ వచ్చి చేరారట. ఆ దర్శకుడు మరెవరో కాదు.. స్టైలిష్ యాక్షన్ మేకర్ సుజీత్ (Sujeeth). ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుజీత్, తొలి చిత్రంతోనే ఫ్రెష్ నెరేషన్ తో పాటు సరికొత్త టేకింగ్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పుడు ఇదే సుజీత్, రామ్ చరణ్‌తో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ కాంబినేషన్ ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశం లేదు. ఎందుకంటే అటు రామ్ చరణ్ సుకుమార్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఇటు సుజీత్ కూడా ‘OG-2’ తో పాటు నేచురల్ స్టార్ నానితో ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే చరణ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రచారంగానే వినిపిస్తున్నప్పటికీ, ఒకవేళ సుజీత్ రామ్ చరణ్ కోసం ఒక స్ట్రాంగ్ యాక్షన్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తే మాత్రం థియేటర్లలో విజువల్ ఫీస్ట్ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.