సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య సరికొత్త అవతార్.. కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!

ABN, Publish Date - Sep 23 , 2026 | 01:27 PM

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. దీంతో తొలిసారి వీరి కాంబోలో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం 'NBK112'. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. దీంతో తొలిసారి వీరి కాంబోలో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుండటంతో అటు టాలీవుడ్ సర్కిల్స్‌లోనే కాక, ఇటు అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కి కొరటాల క్లాస్ మేకింగ్ తోడైతే వెండితెరపై ఎలాంటి సంచలనం నమోదవుతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయి. అయితే, దాదా మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడటం, ఆపై శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలకృష్ణ పూర్తిగా కోలుకున్న వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నారు.

టాలీవుడ్‌లో కొరటాల శివ కథల శైలి చాలా ప్రత్యేకం. సమాజంలోని ఒక సున్నితమైన సమస్యను లేదంటే ఓ బలమైన సామాజిక అంశాన్ని ఎంచుకుని, దానికి పూర్తిస్థాయి కమర్షియల్ హంగులు జోడించడంలో ఆయన సిద్ధహస్తుడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో హీరోల మాస్ ఇమేజ్‌ను ఏమాత్రం తగ్గించకుండానే, వారి పాత్రలకు బలమైన సామాజిక బాధ్యతను జోడించి భారీ విజయాలు అందించారు.

ఇప్పుడు అదే ఫార్ములాను బాలకృష్ణ పాత్రపైనా ప్రయోగిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రౌద్రంతో కూడిన మాస్ పాత్రలకు, హై-వోల్టేజ్ డైలాగ్ డెలివరీకి చిరునామా అయిన బాలకృష్ణలోని సరికొత్త కోణాన్ని కొరటాల శివ ఆవిష్కరించబోతున్నారట. కేవలం ఆవేశం మాత్రమే కాకుండా, ఆలోచన రేకెత్తించే భావోద్వేగాలకు ఈ చిత్రంలో అధిక ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఒక వినూత్నమైన మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం. కేవలం పవర్‌ఫుల్ యాక్షన్‌కే పరిమితం చేయకుండా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కొరటాల పెద్దపీట వేస్తున్నారని టాక్. ఊరమాస్ అంశాలతో పాటు సమాజ హితం కోసం పోరాడే నాయకుడిగా బాలకృష్ణ కనిపిస్తే, అది ఆయన కెరీర్‌లోనే ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు ఆర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య లక్ష్మి, ఐశ్వర్య రాజేష్‌లను ప్రధాన పాత్రల కోసం కొరటాల ఎంపిక చేసినట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Sep 23 , 2026 | 01:45 PM