సూర్యకు జాక్‌పాట్.. లెజెండరీ దర్శకుడితో మూవీ?
ABN, Publish Date - Sep 23 , 2026 | 08:07 AM
సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ప్లాపులు సహజం. కొన్నాళ్లు సక్సెస్ దూరమైతే చాలు.. ఇక ఆ హీరో పని అయిపోయిందని తేల్చేసే వాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ,
సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ప్లాపులు సహజం. కొన్నాళ్లు సక్సెస్ దూరమైతే చాలు.. ఇక ఆ హీరో పని అయిపోయిందని తేల్చేసే వాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ, నిజమైన స్టార్ ఒక్క హిట్ కొడితే ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర ఎలా మొదలవుతుందో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నిరూపిస్తున్నారు. గతంలో వరుస ప్లాపులు పలకరించినా.. ఈ ఏడాది మాత్రం సూర్య చూపించిన విశ్వరూపం మామూలుగా లేదు. పాత సూర్యలోని ఎనర్జీని, బాక్సాఫీస్ స్టామినాని మళ్లీ థియేటర్లలో ప్రత్యక్షంగా చూపిస్తూ రికార్డుల వేట మొదలుపెట్టారు.
ఈ బాక్సాఫీస్ జర్నీ మొదలైంది మే నెలలో వచ్చిన 'కరప్పు' చిత్రంతో. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. సూర్య మార్కెట్ రేంజ్ ఏంటో చాటిచెప్పిన సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది.
'కరప్పు' అందించిన బ్లాక్‌బస్టర్ జోష్ కొనసాగుతుండగానే.. ఆగస్టు 14న వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, క్లాస్-మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసునూ గెలుచుకుంది. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్కును దాటి, సూర్య క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది.
ఇప్పటికే రెండు భారీ విజయాలు ఖాతాలో వేసుకున్న సూర్య, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆవేశం' వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందించిన జీతు మాధవన్ దర్శకత్వంలో ప్రస్తుతం 'సీన్' మూవీలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 6న దీపావళి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుండగా... ఈ సినిమాతో సూర్య ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో మరో క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న ‘ఇంజి వెల్లం’ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చర్చలు సాగుతున్నాయట. నిజానికి సుమారు ఎనిమిదేళ్ల క్రితమే వీరిద్దరి మధ్య ఈ కథపై చర్చ జరిగింది.
కొన్ని కారణాల వల్ల అప్పట్లో మొదలుకాని ఆ ప్రాజెక్ట్‌ను, ఇప్పుడు నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి సూర్యకు వినిపించేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘యువ’ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథ సూర్యకు నచ్చితే ఈ సెన్సేషనల్ కాంబో సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. మరి ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాలి.