Nani Krithi Shetty: నాని, కృతి శెట్టి.. లిప్‌లాక్ సీన్! ఈ వివాదం.. ఇప్పట్లో చల్లారేనా
ABN, Publish Date - Sep 05 , 2025 | 12:58 PM
ఎప్పుడు ఏ విషయం తెర మీదకు వస్తుందో, ఎందుకు వస్తుందో మళ్లీ ఎలా గాయబ్ అవుతుందో అనేది ఇప్పటికీ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎప్పుడు ఏ విషయం తెర మీదకు వస్తుందో, ఎందుకు వస్తుందో మళ్లీ ఎలా గాయబ్ అవుతుందో అనేది ఇప్పటికీ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే సంవత్సరాలు గడిచిన తర్వాతైనా వెంటపడుతుంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాను పీల్చి పిప్పి చేస్తుంది. అసలు విషయానికి వస్తే.. ఇటీవల నటి కృతి శెట్టి (Krithi Shetty) ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. 2021లో విడుదలైన శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) సినిమాలో నటుడు నాని (Nani)తో చేసిన లిప్‌లాక్ సీన్ గురించి మాట్లాడుతూ తాను ఆ సమయంలో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని ఇకపై అలాంటి కిస్సింగ్, స్మోకింగ్ సీన్లు ఎన్నటికీ చేయనని స్పష్టం చేసింది.
ఇప్పుడు.. ఈ విషయమే వివాదానికి కేంద్ర బిందువైంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో కృతి వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే కాగా, హీరో నానికి 37 ఏళ్ల వయసు అనే విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తూ నానిపై, డైరెక్టర్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan)పై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. లేచిన దగ్గరి నుంచి సుద్దులు చెప్పే హీరోలు ఇలా చేయవచ్చా.. ఈ పద్దతి సరైనదేనా, అలా చేయింయచ వచ్చా, తనకన్నా వయస్సులో సగం ఉన్న యువతితో అలాంటి సన్నివేశాలు చిత్రీకరించడం చట్టపరంగా సమంజసమా? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో.. కృతి వ్యాఖ్యలు వైరల్ కావడంతో, నాని సహా సినిమా మేకర్స్ కూడా ట్రోలింగ్‌కు గురయ్యారు. కొందరు నెటిజన్లుర్లు “37 ఏళ్ల నాని, 17 ఏళ్ల కృతిని కిస్ చేశాడు. ఇది మరో నటుడు చేసి ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు అంటూ నానా యాగీ చేసేవారని” కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే “కృతి శెట్టి తన డెబ్యూ సినిమా ఉప్పెన (Uppena)లో 16 ఏళ్ల వయసులో ఈ తరహా సీన్లలో నటించింది అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది నాడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?” అంటూ కృతిపైన కూడా విమర్శలు చేస్తున్నారు.
అయితే.. సినిమా షూటింగ్ సమయాల్లో చాలా మంది నటులు ఆ సన్నివేశం పూర్తి చేయాలని తమకు అసౌకర్యం అయినా బయటకు బహిర్గతం చేయకుండా ప్రొఫెషనల్‌గా సీన్ పూర్తి చేస్తారు. కానీ, తర్వాత అలాంటి అనుభవాల్ని అనుకోకుండా వెళ్లడించడంతో అవి కాస్త వైరల్ అయిపోయి కాలానికి, సందర్బానికి సంబధం లేకుండా ట్రోలర్స్ చేతికి చిక్కి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం నాని ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ, ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా? లేక నాని లేదా చిత్ర బృందం నుంచి క్లారిటీ వస్తుందా? అనేది చూడాలి.