సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ఐరావతం’ (Iravatham).. టాక్ ఏంటంటే?

ABN , First Publish Date - 2022-05-09T04:32:04+05:30 IST

‘ఐరావతం’ (Iravatham) అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇంద్రుడి వాహనమైన తెల్ల ఏనుగు. ‘మహాభారతం’ (Mahabharatam)లో ఐరావతంకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఇప్పుడదే టైటిల్‌తో టాలీవుడ్‌లో ఓ చిత్రం తాజాగా విడుదలైంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం

సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ఐరావతం’ (Iravatham).. టాక్ ఏంటంటే?

‘ఐరావతం’ (Iravatham) అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇంద్రుడి వాహనమైన తెల్ల ఏనుగు. ‘మహాభారతం’ (Mahabharatam)లో ఐరావతంకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఇప్పుడదే టైటిల్‌తో టాలీవుడ్‌లో ఓ చిత్రం తాజాగా విడుదలైంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. థ్రిల్లర్ చిత్రాలకు కాస్త కమర్షియల్ టచ్ కూడా ఇస్తే యూత్ ఎలా ఇంట్రస్ట్ చూపిస్తారో.. ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి. ఇప్పుడలాంటి నేపథ్యంలోనే తెరకెక్కిన ‘ఐరావతం’ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్ర టాక్ ఎలా ఉందో తెలుసుకునే ముందు చిత్ర కథ గురించి చెప్పుకుంటే.. శ్లోక (తన్వీ నేగి Tanvi Negi) ఓ బ్యూటీషియన్. ఆమె తన బాయ్ ఫ్రెండ్ చిక్కు(అమర్ దీప్ చౌదరి Amardeep Chowdary)తో ప్రేమలో ఉంటుంది. శ్లోకకి పుట్టినరోజు కానుకగా ఓ వైట్ కెమెరాను అతను బహుమతిగా ఇస్తాడు. ఆ కెమెరా ప్రత్యేకత ఏమిటంటే... శ్లోక ఆ కెమెరాతో తన వీడియో తీసుకుంటే... తనను పోలిన ప్రిన్సీ అనే అమ్మాయి వీడియో ప్లే అవుతుంది. ఇలా ప్లే అయిన ప్రతిసారి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ క్రైం థ్రిల్లర్ స్టోరీ ప్లే అవుతుంది. ఆ కెమెరా ప్రత్యేకత గురించి, ప్రిన్సీ గురించి.. మాయ (ఏస్తర్ Ester Noronha) శ్లోకకి చెబుతుంది. అలా కెమెరా వల్ల శ్లోక, ప్రిన్సీ మంచి స్నేహితులు అవుతారు. ప్రిన్సీ మోడల్‌గా పనిచేస్తూ వుంటుంది. ఆమెకు సన్నీ అనే బాయ్ ఫ్రెండ్ వుంటాడు. అతను మంచి ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. అయితే శ్లోక, ప్రిన్సీలలో ఎవరో ఒకరు చనిపోవడం ఖాయం అని కూడా మాయ (ఎస్తర్) చెబుతుంది. మరోవైపు సీరియల్ మర్డర్లతో పోలీసులకు సవాల్ విసురుతుంటాడో సైకో కిల్లర్. అసలు ఆ తెల్ల కెమెరా అసలు కథ ఏంటి? శ్లోక, ప్రిన్సీ‌లలో ఎవరు చనిపోయారు? వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికుంది? సైకో కిల్లర్ ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘ఐరావతం’ కథ.


సరైన కంటెంట్‌తో వచ్చిన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్‌ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇది కూడా అలాంటి చిత్రమే. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలానే ‘ఐరావతం’ సినిమాని దర్శకుడు సుహాస్ తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ కార్డు పడేవరకు సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాడు. కాకపోతే స్టోరీ నడిచే విధానమే సగటు ప్రేక్షకుడిని కొంత కన్ఫ్యూజన్‌కి గురి చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్‌కి క్లైమాక్స్‌లో ఇచ్చే మెసేజ్‌తో ఓ క్లారిటీ వస్తుంది. అక్రమ సంబంధాలతో నిర్లక్ష్యానికి గురైన ఓ అబ్బాయి.. చివరకు ఎలా మారాడు అనేది ఈ చిత్రంలో చక్కని మెసేజ్‌తో దర్శకుడు చూపించాడు. తను బాగా ఇష్టపడే అమ్మాయి ఇతరులతో చనువుగా ఉండటం భరించలేని సగటు ప్రేమికుని ఆవేదనని ఈ చిత్రంలో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. హీరోగా చేసిన అమర్ దీప్ చౌదరి ఇప్పటికే పలు సీరియల్స్‌లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిక్కు పాత్రలో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. హీరోయిన్ ద్విపాత్రాభినయంలో బాగా గుర్తుండి పోయే పాత్రను పోషించింది. ఓ వైపు బ్యూటీషియన్‌గా.. మరోవైపు మోడల్‌గా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించింది. ఇంకా సన్నీగా నటించిన అరుణ్ జాను తన నటనతో అలరిస్తాడు. అతనికి జోడీగా నటించిన ఎస్తర్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. చివర్లో చర్చి ఫాదర్ క్యారెక్టర్‌లో సప్తగిరి (Sapthagiri) కనిపించి ప్రేక్షకులను కాసేపు నవ్వించారు.


డైరెక్టర్ సుహాస్ మీరా(Suhaas Meera) ఎంచుకున్న కథ.. స్టార్టింగ్‌లో కాస్తంత కన్ఫ్యూజన్‌కి గురి చేసినా.. ట్విస్టులతో స్క్రీన్‌ప్లేని నడిపిన తీరు ఉత్కంఠను రేపుతుంది. చివరి వరకు సస్పెన్స్‌ని కొనసాగించిన తీరు.. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. కాస్త పేరున్న క్యాస్టింగ్ పడితే.. ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునే వారు. అలాంటి ఎంగేజింగ్ థ్రిల్లర్ చిత్రమిది. సత్య కశ్యప్ అందించిన రెండు పాటలు, కార్తీక్ కడగండ్ల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. అలాగే ఆర్.కె.వల్లెపు సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారు.. ఈ సినిమాతో బాగా ఎంజాయ్ చేస్తారు.

Updated Date - 2022-05-09T04:32:04+05:30 IST