Unni Mukundan: ఆ హీరో సినిమాకు పాజిటివ్ రివ్యూ.. సొంత మేనేజర్‌పై మార్కో హీరో దాడి
ABN , Publish Date - May 27 , 2025 | 02:47 PM
ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పై పోలీసు కేసు నమోదైంది. తన మాజీ మేనేజర్ పై దాడి చేసిన కేసు అతనిపై రిజిస్టర్ అయ్యింది.
ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) చిక్కుల్లో పడ్డారు. తన సొంత మేనేజర్ పైనే చేయి చేసుకుని పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. పలు మలయాళ చిత్రాలలో హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ తెలుగులోనూ 'జనతా గ్యారేజ్' (Janatha Garage), 'భాగమతి' (Bhagamathi), 'ఖిలాడీ' (Khiladi), 'యశోద' (Yashoda) చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. అలానే గత యేడాది అతను నటించిన 'మార్కో' (Marco) చిత్రం జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది, ఉన్ని ముకుందన్ కు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఉన్ని ముకుందన్ మేనేజన్ విపిన్ కుమార్... ఆయనపై కేసు పెట్టారు.
మలయాళ చిత్రసీమలోని ప్రముఖ కథానాయకుడు టొవినో ధామస్ (Tovino Thomas) నటించిన 'నారివెట్ట' (Narivetta) మూవీపై తాను పాజిటివ్ రివ్యూను షేర్ చేసినందుకు ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశాడని మేనేజర్ పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోమవారం ఉదయం తన అపార్ట్ మెంట్ కు వచ్చి పార్కింగ్ ప్లేస్ కు తీసుకెళ్ళి తిట్లడమే కాకుండా తనపై దాడి చేశాడని తెలిపాడు. 'మార్కో' సినిమా తర్వాత ఉన్ని ముకుందన్ కు గొప్ప ఆఫర్స్ ఏమీ రాలేదని, అలానే స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటే... నిర్మాతల వెనక్కి వెళ్ళిపోయారని, ఈ సంఘటనలతో అతను ఫ్రస్టేషన్ కు గురై తనపై చేయి చేసుకున్నాడని విపిన్ ఆరోపించాడు.
అయితే విపిన్ వ్యాఖ్యలను ఉన్ని ముకుందన్ ఖండించాడు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నందుకే విపిన్ ను హెచ్చరించానని చెప్పాడు. తన స్నేహితుడి సలహా మేరకు విపిన్ అపార్ట్ మెంట్ కు వెళ్ళిన మాట వాస్తవమని, అప్పటి వరకూ తనకు క్షమాపణలు చెబుతానని అన్న విపిన్ ఆ తర్వాత అడ్డం తిరిగాడని, అంతేకాకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తనతో నేరుగా మాట్లాడేందుకు సాహసించలేదని అన్నాడు. కూల్ గ్లాసెస్ తీయమని తాను చెప్పినా వినలేదని, దాంతో వాటిని తీసి పగలకొట్టానని అంగీకరించాడు. అంతే తప్పితే... విపిన్ పై తాను చేయి చేసుకోలేదని అన్నాడు. ఆ సమయంలో అక్కడి సీసీ టీవీలు పనిచేస్తున్నాయని, కొంతమంది తమను గమనిస్తూనే ఉన్నారని తెలిపాడు.
టొవినో థామస్ తో తనకు ఎన్నో ఏళ్ళుగా సత్ సంబంధాలు ఉన్నాయని ఉన్ని ముకుందన్ తెలిపాడు. తన 'మార్కో' చిత్రం సక్సెస్ ను కూడా టోవినో థామస్ తో కలిసి ఎంజాయ్ చేశానని, అతనికి విజయం వస్తే తాను అంతే సంతోషిస్తాను కానీ అసూయ చెందనని ఉన్ని తెలిపాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని టొవినో థామస్ కు తాను తెలిపానని, ఇలాంటి వ్యాఖ్యలు తమ స్నేహబంధాన్ని తెంచలేవని ఉన్ని ముకుందన్ చెప్పాడు. అయితే విపిన్ ఫిర్యాదును స్వీకరించిన ఇన్ఫో పార్క్ పోలీసులు కేసును రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: Bhanumathi Ramakrishna: అరవై ఏళ్ళ అక్కినేని అంతస్తులు
Also Read: Sunny Leon: హాలీవుడ్ చిత్రంలో పోర్న్ స్టార్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి