ది ప్యారడైజ్.. ముందు భారీ టార్గెట్! హిట్ అవ్వాలంటే.. అన్ని కోట్లు రావాలా?
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:58 PM
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే ‘ది ప్యారడైజ్’ .
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే ‘ది ప్యారడైజ్’ (The Paradise). నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’ ఎలాంటి సంచలనం సృష్టించిందో చూశాం. ఊరమాస్ బొగ్గు గనుల నేపథ్యంతో నాని (Nani) నటన, శ్రీకాంత్ (Srikanth Odela) టేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుండటంతో అటు ప్రేక్షకుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ భారీ అంచనాలకు తగ్గట్టే టీజర్, పోస్టర్లు సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రొటీన్‌కు భిన్నమైన రా అండ్ రస్టిక్ లుక్‌లో నాని కనిపించిన తీరు సినీ ప్రియుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది.
ఇక రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘ఆయాషేర్’, ‘ఏష నాగుల’ పాటలు యూట్యూబ్‌లో వ్యూస్ సునామీ సృష్టిస్తూ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే శ్రోతలను ఈ ట్రాక్స్ ఏ స్థాయిలో ఊపేస్తున్నాయో స్పష్టమవుతోంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ క్రమంలోనే అందరి దృష్టీ ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ మీదే పడింది. గతంలో ‘దసరా’ 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో, ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.100 కోట్లకు పైగానే అమ్ముడయ్యాయి. నైజాంలో రూ.34 కోట్లు, ఆంధ్రాలో రూ.40 కోట్లు, హిందీతో పాటు ఇతర భాషల్లో రూ.10 కోట్లు, అలాగే ఓవర్సీస్‌లో రూ.17 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. నాని సినీ ప్రయాణంలో వంద కోట్ల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ మార్కెట్‌ను తాకిన మొట్టమొదటి సినిమాగా ‘ది ప్యారడైజ్’ సరికొత్త రికార్డు నమోదు చేసింది.
బిజినెస్ ఇంత భారీగా జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా అంతే పెద్ద సవాలుగా మారింది. బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి వచ్చి, సినిమా ‘క్లీన్ హిట్’ స్టేటస్ దక్కించుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.135 కోట్ల మేర షేర్ రాబట్టాలి. అంటే బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.150 కోట్ల గ్రాస్ మార్కును దాటాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. నాని మార్కెట్ పరిధిని చూస్తే ఇది నిజంగానే అత్యంత భారీ లక్ష్యమనే చెప్పాలి.
అయితే, సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నార్త్ అమెరికా ప్రీమియర్స్‌తోనే 1 మిలియన్ డాలర్ల మార్కును అలవోకగా దాటేసింది. ఇది మామూలు రికార్డు కాదు.. పక్కా మాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. మరోవైపు, సినిమాకు మరింత ఊపునిచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిచ్చాయి.
రేట్ల పెంపుతో పాటు ఈ స్థాయి ఓపెనింగ్స్ కలిసి వస్తుండటంతో మొదటి వీకెండ్‌లోనే భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. 200 కోట్ల గ్రాస్ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే, ఏ కొద్దిపాటి తేడా వచ్చినా, టాక్ కాస్త అటూఇటూ అయినా ఇంతటి భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కత్తిమీద సాములా మారుతుంది. మరి ఈ భారీ రికార్డులను తిరగరాస్తూ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.