CM రేవంత్‌రెడ్డికి నాని ప్రత్యేక విజ్ఞప్తి.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌కు అనుమతి కోరిన హీరో
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:17 AM
నాని ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షోకు సంబంధించి నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (the paradise) విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్ షోకు సంబంధించి నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 23న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్వహించనున్న ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను తికించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని నాని కోరారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని X (ట్విట్టర్)లో ట్యాగ్ చేస్తూ ప్రత్యేక పోస్ట్ చేశారు. ఆ పోస్టులో.. ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడటం తనకు ఎంతో ఇష్టమని, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులు, సినీ ప్రేక్షకులతో కలిసి ‘ది ప్యారడైజ్’ను వీక్షించాలని ఉందని నాని తెలిపారు. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రత్యక్ష స్పందనను వారి మధ్యే కూర్చొని అనుభవించడం ఓ నటుడిగా, నిర్మాతగా దక్కే అత్యంత సంతృప్తికరమైన క్షణమని పేర్కొన్నారు.
సినిమా కోసం ఎన్నో నెలలు శ్రమించిన తర్వాత ప్రేక్షకుల స్పందనను థియేటర్‌లోనే ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తి తనకు ఉందని నాని వెల్లడించారు. అభిమానులతో కలిసి సినిమా చూడటం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా భద్రతా అంశాలపై కూడా నాని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం, పోలీసు శాఖ సూచించే అన్ని భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్స్‌ను పూర్తిగా పాటిస్తామని తెలిపారు. ప్రీమియర్ షో సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు శాఖ అధికారులను నాని కోరారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా నానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో, నాని చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.