అలరిస్తున్న ‘తోట తరణి - ఒక పునరావలోకనం’ ప్రదర్శన
ABN, Publish Date - Oct 26 , 2026 | 09:36 AM
ప్రముఖ కళా దర్శకుడు పద్మశ్రీ తోట తరణి కుంచె నుంచి జాలు వారిన కళారూపాలు విశేషంగా అలరిస్తున్నాయి. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని లలిత కళా అకాడమీలో ‘తోట తరణి ఒక పునరావలోకనం’ పేరుతో ఏర్పాటైన ఈ ప్రదర్శన ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.
ప్రముఖ కళా దర్శకుడు పద్మశ్రీ తోట తరణి (Padma Shri Thota Tharani) కుంచె నుంచి జాలు వారిన కళారూపాలు విశేషంగా అలరిస్తున్నాయి. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని లలిత కళా అకాడమీలో ‘తోట తరణి ఒక పునరావలోకనం’ (Thota Tharani Punaravalokanam) పేరుతో ఏర్పాటైన ఈ ప్రదర్శన ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఔత్సాహికులు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రదర్శనను తిలకించవచ్చు. శనివారం సాయంత్రం ఈ ప్రదర్శనను కేసీబీ జాయింట్ డైరెక్టర్ కవితాదత్ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్ట్ వరల్డ్ - సరళాస్ ఆర్ట్ ఇంటర్నేషనల్ సమర్పించిన ఈ ప్రదర్శన పెయింటింగ్, డ్రాయింగ్, ప్రింట్ మేకింగ్, కుడ్య చిత్రాల వంటి కళారూపాలతో తోట తరణి కళా ప్రస్థానాన్ని పరిచయం చేస్తోంది.
ఐదు దశాబ్ధాలకు పైగా సాగిన తోట తరణి కళా ప్రస్థానంలోని వివిధ దశలకు చెందిన 280కి పైగా కళా ఖండాలను ఈ వేదిక ఒక చోట చేర్చింది. ఈ కళా ఖండాలు ప్రకృతి, వాస్తుశిల్పం, భారతీయ సంప్రదాయాలు, పురాణాలు, సంగీతం.. నిత్యజీవితంపై ఆయన చేసిన అన్వేషణలను ప్రతిబింబిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా తోట తరణి జీవితం, సృజనాత్మక ప్రస్థానం గురించి వివరించేలా డాక్టర్ అష్రఫ్ ఎస్. భగత్ రచించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా ముఖ్య అతిథి కవితా దత్ అవిష్కరించారు.
ఈ సందర్భంగా తోట తరణి మాట్లాడుతూ.. తన జీవితంలోని వివిధ దశలకు చెందిన చిత్రాలను, 16 ఏళ్ల వయసులో వేసిన పెయింటింగ్‌ల సహ ఒక చోట చేర్చి, ఈ పునరావలోకనాన్ని రూపొందించడానికి దాదాపు సంవత్సరం పట్టిందని వివరించారు. 1969లో తాను వేసిన తొలి వాటర్ చిత్రాలు తమ తండ్రి టెక్నిక్, బెంగాల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ నుంచి ప్రేరణ పొందాయన్నారు. తాను తరచుగా ఒక అంశాన్ని అన్వేషించడానికి 50 నుంచి 100 పెయింటింగ్‌లు వేస్తుంటానన్నారు. ఐదు దశాబ్దాల తరువాత కూడా ప్రయోగాలు చేయడానికి కొత్త దృక్కోణాలను, సృజనను కనుగొనడానికి తనలో ఇంకా తపన ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఫ్రీతారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐదేళ్ల తర్వాత మళ్లీ.. రజనీకాంత్ ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్
రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్‌కు బ్రేక్.. కారణమిదేనా?
టాలీవుడ్లో ‘జైలర్ 2’ హిస్టరీ.. ఫస్ట్ కోలీవుడ్ ఫిల్మ్‌గా రికార్డ్