సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా కుమార్తెపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Nov 19 , 2026 | 08:32 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను, నిరాధారమైన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Arjun Sarja Warning

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Action King Arjun) తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను, నిరాధారమైన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల తన చిన్న కుమార్తె అంజన వివాహం జరిగినప్పటి నుంచి, ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియా, కొన్ని మీడియా మాధ్యమాల్లో రకరకాల ఊహాగానాలు, అసభ్యకర వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. అర్జున్ గురువారం (నవంబర్ 19) ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఒక తండ్రిగా తన కుమార్తె ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తాను మౌనంగా ఉండలేనని స్పష్టం చేస్తూ, బాధ్యులపై ఇప్పటికే సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.


ముందుగా చిన్న కుమార్తె అంజన వివాహ సందర్భంగా తమ కుటుంబానికి ప్రేమ, శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ అర్జున్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెద్ద కుమార్తె ఐశ్వర్య అంశంపై స్పందిస్తూ.. ‘‘నా చిన్న కుమార్తె పెళ్లి జరిగినప్పటి నుంచి నా పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె గోప్యతను గౌరవిస్తూ, ఆమె స్వయంగా పంచుకోవాల్సిన విషయాలపై నేను ఇప్పటివరకు స్పందించలేదు. ప్రతి మహిళకు తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు, తనకు నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉంటుంది. అవసరమైతే ఆమె తన సమయం వచ్చినప్పుడు స్వయంగా మాట్లాడుతుంది. కానీ ఒక తండ్రిగా నా కుమార్తె పై, ఆమె వ్యక్తిత్వంపై నిరాధారమైన, అత్యంత అవమానకరమైన ఆరోపణలు చేస్తుంటే నేను మౌనంగా ఉండలేను’’ అని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

నటులుగా తాము పబ్లిక్ లైఫ్‌లో ఉన్నందున విమర్శలు, ఊహాగానాలు సహజమని, అయితే ఊహాగానాలకు, కావాలని చేసే దుష్ప్రచారాలకు మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా ఒక మహిళకు మద్యపాన వ్యసనం ఉందంటూ ముద్ర వేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని, దీనిని ఏమాత్రం సహించబోమని మండిపడ్డారు. ‘‘మౌనం అనేది ఎప్పుడూ హుందాతనమైన సమాధానం అని మేము నమ్ముతాము. కానీ మా మౌనాన్ని అంగీకారంగా భావించి తప్పుడు సమాచారాన్ని పదేపదే ప్రచారం చేయడం సరికాదు. అందుకే సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకున్నాము’’ అని పేర్కొన్నారు.


జర్నలిజం వృత్తి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, అయితే కొన్ని మీడియా విభాగాలు నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం వ్యూస్, కంటెంట్ అమ్ముకోవడం కోసం వ్యక్తిగత దాడులను సంచలనం చేయడం దురదృష్టకరమని అర్జున్ విమర్శించారు. ఇది కేవలం తన కుమార్తె గురించి మాత్రమే కాదని, సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతి మహిళకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. ఒక తండ్రిగా తన కుమార్తె గౌరవం, స్వేచ్ఛ కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని స్పష్టం చేసిన అర్జున్.. ఇకపై ఇలాంటి నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ప్రచారాలను కొనసాగిస్తే కఠినమైన, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్

‘ఆదర్శ కుటుంబం’ టీమ్ పై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

మిస్కిన్ టచ్‌పై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్

Updated Date - Nov 19 , 2026 | 08:32 PM