Arjun Sarja: ఆటిజంపై అవగాహాన కలిగించే 'మఫ్టీ పోలీస్'
ABN , Publish Date - Nov 20 , 2025 | 03:24 PM
అర్జున్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'మఫ్టీ పోలీస్'. ఈ సినిమాతో నిర్మాతగా తన స్థాయి మరో అడుగు పెడుగుతుందని నిర్మాత ఎ.ఎన్. బాలాజీ చెబుతున్నారు.
అర్జున్ సర్జా (Arjun Sarja), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) కీలక పాత్రలు పోషించిన సినిమా 'తీయవర్ కులై నడుంగ'. ఈ సినిమా తెలుగులో శుక్రవారం 'మఫ్టీ పోలీస్' పేరుతో విడుదల కాబోతోంది. దినేష్ లక్ష్మణన్ (Dineesh Laxman) దర్శకత్వంలో ఈ సినిమాను జి. అరుల్ కుమార్ (Arul Kumar) నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎ. ఎన్. బాలాజీ (A N Balaji) విడుదల చేస్తున్నారు. గతంలో బాలాజీ దాదాపు 400 చిత్రాలను పంపిణీ చేశారు. అలానే నిర్మాతగా తెలుగువారి ముందుకు 'రంగం -2, యుద్థభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం' తదితర చిత్రాలను అనువదించి విడుదల చేశారు. ఇక తాజా చిత్రం 'మఫ్టీ పోలీస్'తో తన స్థాయి మరో అడుగు పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా కథ గురించి బాలాజీ తెలియచేస్తూ, 'ఇక రచయిత హత్య నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇటీవల కాలంలో పిల్లల పాలిట భూతంగా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చూపించారు. దీనిపై సాధారణ ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నాన్ని దర్శకుడు చేశాడు. తెలుగువారికి దశాబ్దాలుగా యాక్షన్ కింగ్ అర్జున్ అంటే ఏమిటో తెలుసు. యాక్షన్ మూవీస్ మాత్రమే కాకుండా 'పుట్టింటికి రా చెల్లి' వంటి సెంటిమెంట్ మూవీస్ సైతం అర్జున్ చేశారు. అలానే ప్రముఖ నటుడు, స్వర్గీయ రాజేశ్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేశ్ ఈ యేడాది విడుదలై, ఘన విజయం సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడం అనేది బాగా కలిసి వచ్చే అంశం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఈ మూవీని విడుదల చేస్తున్నాం. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. ఇందులో యాక్షన్ తో పాటు పర్సనల్ డ్రామా కూడా ఆసక్తికరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దినేష్ లక్ష్మణన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శరవణన్ అభిమన్యు సంగీతం సమకూర్చాడు.
Also Read: Kotha Lokah: కళ్యాణీ ప్రియదర్శన్ కొత్త సినిమా
Also Read: Nagavamsi: కేవీఎన్ ప్రొడక్షన్స్ తో నాగవంశీ డీల్