బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్

ABN , Publish Date - Nov 19 , 2026 | 08:04 PM

‘పుష్ప’ సిరీస్‌ చిత్రాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ స్థాయి విజయం తర్వాత బన్నీ తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Allu Arjun and Boyapati Srinu

‘పుష్ప’ సిరీస్‌ చిత్రాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ స్థాయి విజయం తర్వాత బన్నీ తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ‘రాకా’ (Raaka) తర్వాత మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో ‘AA23’ చేయడానికి బన్నీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే, ఈ రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల తర్వాత బన్నీ ఓ పక్కా తెలుగు మాస్ దర్శకుడితో చేతులు కలపబోతున్నారన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


ఆ మాస్ దర్శకుడు మరెవరో కాదు.. బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బోయపాటి శ్రీను (Boyapati Srinu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బన్నీని సరికొత్త మాస్ యాంగిల్‌లో చూపించి, అటు అభిమానులకు పూనకాలు తెప్పించడంతో పాటు, ఇటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బోయపాటి. అప్పటి నుంచే వీరిద్దరి కలయికలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వీరిద్దరి కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, మధ్యలో బోయపాటి తెరకెక్కించిన ‘అఖండ 2’ (Akhanda 2) ఫలితం తర్వాత, ఈ కాంబో ఉంటుందా లేదా అన్న ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి.

కానీ, తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబో దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌ను కలిసి ఓ ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఈసారి వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా కేవలం రొటీన్ మాస్ యాక్షన్ చిత్రం కాదని, ఇందులో బలమైన పౌరాణిక నేపథ్యం ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బోయపాటి చెప్పిన ఆ కొత్త పాయింట్, కథలోని ఎమోషన్ బన్నీకి బాగా నచ్చడంతో.. కథ విన్న వెంటనే సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


అయితే, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినప్పటికీ, ఈ సినిమా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లడం కష్టమంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం బన్నీ చేతిలో ఉన్న భారీ లైనప్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అట్లీ ‘రాకా’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటంతో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కే చాలా సమయం పట్టేలా ఉంది. ఆ తర్వాత బన్నీ, లోకేశ్ కనగరాజ్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. లోకేశ్ సినిమా పూర్తయిన తర్వాతే బోయపాటి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే, అల్లు అర్జున్ - బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాప్‌లో బోయపాటి మరో మూవీ చేస్తారా? లేక స్క్రిప్ట్‌ను మరింత పక్కాగా సిద్ధం చేస్తారా? అన్నది చూడాలి. ఏదేమైనా, మాస్ పల్స్ తెలిసిన బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ మళ్లీ జతకడితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘ఆదర్శ కుటుంబం’ టీమ్ పై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

మిస్కిన్ టచ్‌పై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్

దుల్కర్ ‘మిడాస్ టచ్’

Updated Date - Nov 19 , 2026 | 08:04 PM

Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌ కసి అదే.. పెద్ద ప్లానే ఇది...

Allu Arjun - Atlee: దీపికానే ఫైనల్!

Allu Arjun - Netizens: ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయ్‌ బన్నీ!

Boyapati Sreenu: అల్లు అర్జున్‌ – బోయపాటి సినిమా గేట్లు మూసుకున్నట్లే!

Boyapati Srinu: త్వ‌ర‌లో అఖండ 3 ఉంటుంది.. చిరంజీవి, బాలకృష్ణల‌తో మల్టీ స్టారర్‌ చేస్తా