‘రామాయణం’పై వర్మ ప్రశంసల వర్షం.. విమర్శకులకు తనదైన స్టైల్లో కౌంటర్!
ABN, Publish Date - Nov 09 , 2026 | 12:44 PM
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రామాయణం’ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్యకావ్యంగా అభివర్ణిస్తూ, విమర్శకుల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిత్రబృందానికి మద్దతుగా నిలిచారు.
'రామాయణం' సినిమాను తెలుగు సినీ జనాలు పొడుతున్నట్టుగా ఉత్తరాది వాళ్ళు పొగడటం లేదు. రాజమౌళి మొదలు కొని తెలుగు సినీ ప్రముఖులు రామాయణాన్ని ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా దేవుడంటే భయమూ, భక్తి లేని రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమాను అద్భుత దృశ్యంగా పోల్చారు. ఈ సినిమాను విమర్శించే వాళ్ళ మీద కూడా వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏనుగు వెళుతుంటే వీధి కుక్కలు మొరుగుతాయని, వాటిని పట్టించుకోనక్కర్లేదని చిత్ర బృందానికి వర్మ సలహా ఇచ్చాడు.
ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని ఇలా తెలియచేశాడు. 'రామాయణం' కేవలం భక్తి ప్రధానమైన సినిమా కాదు.. అదొక డివోషనల్ ఫోర్స్! ఈ చిత్రంలో కథానాయకుడు కథకు అతీతంగా ఆకాశంలో తేలియాడే నీలి వర్ణపు దేవుడు కాదు. ప్రపంచం అంతం ఎలా ఉండబోతోందో ముందే తెలిసినా కూడా ఆ విధ్వంసం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఓ మనిషి.
ఇది ఒక రాజ్య ఆవిర్భావం గురించిన కథ కాదు. బలహీనతను సవాలు చేసే ఓ ఆలోచనా విధానం. పాత నియమాలను తగలబెట్టి, ఇప్పుడు కేవలం శక్తి అనే సూత్రంతోనే ముందుకు సాగుతున్న వ్యక్తి తాలూకు ఆలోచనలు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. ఇందులో హింసను కేవలం వినోదం కోసం చూపించలేదు. ప్రతి చర్యకు ఎదురయ్యే పరిణామాలను స్పష్టంగా ఆవిష్కరించారు. ఇదే ఇతర రామాయణ కథనాలన్నింటికీ ఈ చిత్రాన్ని భిన్నంగా నిలబెట్టేది. చాలా సినిమాలు ముందడుగు వేయడానికి సంకోచిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఈ చిత్రం మాత్రం ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు సాగుతుంది. తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించదు. అందుకే గతంలో వచ్చిన చిత్రాలన్నింటికంటే ఇది మరింత బలంగా ప్రేక్షకుల మనసులను తాకుతుంది. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మనం ఓ కథను చూసిన అనుభూతితో ఉండిపోం. ఓ గొప్ప అనుభవాన్ని ఆస్వాదించిన భావన కలుగుతుంది.
సీత అపహరణకు గురైన తర్వాతి సన్నివేశంలో రణ్‌బీర్ ఖాళీగా ఉన్న ఆశ్రమంలో నిలబడి.. ఆమె ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఆ సమయంలో కెమెరా కొంతసేపు అక్కడే నిలిచిపోతుంది. ఆ క్షణంలో రణ్‌బీర్ భావోద్వేగాన్ని అద్భుతంగా పలికించాడు. ఇందులో యశ్ కేవలం ప్రతినాయకుడిగా కనిపించడు. తాను ఏం నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడో.. దాని పర్యవసానాలను ముందే అంగీకరించిన ఓ వ్యక్తి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాడు. రావణుడి పాత్రను యశ్ అద్భుతంగా ఆవిష్కరించాడు. జటాయువు పుష్పక విమానాన్ని అడ్డుకునే సన్నివేశం అద్భుతం. అక్కడ ఎలాంటి ఆర్తనాదాలు వినిపించవు. రెక్కలు ఆగిపోయినా.. అతడి కళ్లలో మాత్రం చివరి వరకు పోరాడాలనే తపన కనిపిస్తుంది. అది కేవలం త్యాగం కాదు. శరీరం సహకరించేంత వరకూ పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పం. మొత్తంగా ఈ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించేందుకు కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకునేది ఒక్కటే. ఇంతటి భారీ ప్రయత్నంతో, అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించిన మీ కృషి ముందు ఈ సినిమాపై వచ్చే ప్రతికూల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏనుగంతటి మీ గొప్ప ప్రయత్నం ముందు వీధి కుక్కల మొరుగుల్లా ఆ విమర్శలు వినిపిస్తాయి' అని చిత్ర బృందానికి దన్నుగా నిలిచారు.
ఇంతవరకూ తాను చదివిన, విన్న, చూసిన రామాయణాలన్నింటితో పోలిస్తే.. నమిత్ మల్హోత్రా రూపొందించిన ఈ 'రామాయణం' ఎన్నో మైళ్ల ఎత్తులో నిలుస్తుందని వర్మ కితాబిచ్చారు. మిగతా రామాయణాలన్నీ దీనితో పోలిస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయని వర్మ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ చారిత్రక ఇతిహాసాన్ని శతాబ్దాలుగా తెరకెక్కించిన దర్శకుల కృషి చరిత్ర పుస్తకాల్లో చిన్న ఫుట్‌నోట్‌గా మిగిలిపోతుందని, ఒక్క నమిత్ మల్హోత్రా పేరు మాత్రమే ఆకాశంలో ధ్రువతారలా వెలుగొందుతుందని వర్మ అన్నారు. రామాయణం ఉన్నంతకాలం నమిత్ మల్హోత్రా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన కేవలం సినిమా తీయలేదని, ఓ వారసత్వ సంపదను అందించారని వర్మ అన్నారు. మొత్తం మీద రామాయణంపై రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాస్తికుడైన వర్మ దీనికి ఈ స్థాయిలో కితాబివ్వడం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
ఇవి కూడా చదవండి!
అందరికీ రాపో స్వాగతం.. ధర్మన్ గట్టిగానే ప్లాన్ చేసిందిగా
‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది
కూతురితో.. రేణూ దేశాయ్ దీపావళి సంబరాలు