సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ధర్మేంద్ర మొదటి వర్ధంతి.. హేమమాలిని ఎమోషనల్ పోస్ట్

ABN, Publish Date - Nov 25 , 2026 | 11:27 AM

బాలీవుడ్ దిగ్గజ నటుడు, ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర కన్నుమూసి ఏడాది పూర్తయింది. 2025 నవంబర్ 24న ముంబై జుహూలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Hema Malini Post

బాలీవుడ్ దిగ్గజ నటుడు, ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసి ఏడాది పూర్తయింది. 2025 నవంబర్ 24న ముంబై జుహూలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మొదటి వర్ధంతి (Dharmendra First Death Anniversary) సందర్భంగా సతీమణి, సీనియర్ నటి హేమమాలిని (Hema Malini) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరితమైన నోట్‌ను పంచుకున్నారు. ధర్మేంద్రతో కలిసి ఉన్న అరుదైన, ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని పాత ఫొటోలను షేర్ చేస్తూ.. ఏడాది గడిచినా తన గుండెల్లోని బాధ తీవ్రత ఏమాత్రం తగ్గలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


హేమమాలిని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాశారంటే.. ‘‘ఒక ఏడాది కాలం వేగంగా గడిచిపోయింది, కానీ నా దుఃఖ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఆయన కేవలం నా భర్త మాత్రమే కాదు.. నా సర్వస్వం. నా స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి.. నాకు వెన్నెముకలా నిలిచిన వ్యక్తి, ఒక్కమాటలో చెప్పాలంటే నా అస్తిత్వమే ఆయన. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నా జీవితంలో పూడ్చలేని లోటు. ఆయన లేని నా జీవితం ఎంతో శూన్యంగా కనిపిస్తోంది’’ అంటూ హేమమాలిని కన్నీటిపర్యంతమయ్యారు.

ధర్మేంద్ర ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం, స్వచ్ఛమైన మంచితనం ఎల్లప్పుడూ ఆయన చుట్టూ ఉండే అందరిపై ప్రేమను కురిపించేవి. సినీ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నప్పటికీ, ఏమాత్రం గర్వం లేకుండా ఎప్పుడూ తన మూలాలకు కట్టుబడి ఉన్న అరుదైన మనిషి ఆయన. ఆత్మకు మరణం లేదని, మళ్లీ జన్మిస్తుందని భగవద్గీత చెబుతోంది. ఈ విషయం నాకు బాగా తెలుసు. కానీ నేను ఇంకా ఈ జన్మలోనే ఉన్నాను, అందుకే ఆయన ప్రేమపూర్వకమైన సాన్నిధ్యాన్ని కోల్పోయానన్న బాధ నన్ను వీడటం లేదు. ధరమ్ జీని గుర్తుంచుకుని, ఆయన తమ జీవితాలపై చూపిన ప్రభావాన్ని తలచుకుంటూ ప్రేమపూర్వక సందేశాలు పంపిన కోట్లాది మంది అభిమానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని హేమమాలిని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


కాగా, ధర్మేంద్ర - హేమమాలిని 1980 మే 2న వివాహం చేసుకున్నారు. వీరికి ఈషా డియోల్, అహానా డియోల్ వోహ్రా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతకుముందే ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా సన్నీ డియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు కుమారులు, విజేత, అజీత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ధర్మేంద్ర మొదటి వర్ధంతి వేళ బాలీవుడ్ ప్రముఖులతో పాటు కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆ మహా నటుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘ఐ హేట్ మ్యారేజ్’ కేవలం బోల్డ్ సినిమా కాదు.. దర్శకుడు ఏం చెప్పారంటే

‘రామాయణ’ రికార్డ్ అవుట్.. రిలీజ్‌కు ముందే ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ సంచలనం

తరుణ్ భాస్కర్‌లో ఇంతటి ఆవేశానికి కారణమేంటి?

Updated Date - Nov 25 , 2026 | 11:27 AM