Dharmendra: ధర్మేంద్రకు.. పద్మ విభూషణ్! బాలీవుడ్ హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:28 PM

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. హీ మ్యాన్‌గా పేరొందిన ధర్మేంద్ర సినీ ప్రయాణం, రికార్డులు, హిట్ సినిమాల పూర్తి వివరాలు.

Dharmendra

ఇటీవల బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డును ప్రకటించింది. 70, 80ల యువతరం అభిమానించిన ‘హీ మ్యాన్‌’గా ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ కిషన్ డియోల్. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపును సంపాదించాడు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో 300కుపైగా చిత్రాల్లో నటించి, హ్యాండ్సమ్ హీరోగా, కమర్షియల్ సక్సెస్ ఐకాన్‌గా నిలిచాడు.

చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా స్వంత ప్రతిభతో ఎదిగి బయట నుంచి వచ్చిన వారికీ స్టార్‌డమ్ సాధ్యమేనని నిరూపించిన ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని లూథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జన్మించారు. 1952లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఆయన, 19 ఏళ్ల వయసులో ప్రకాశ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం, 1960లో విడుదలైన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో మైలురాయిగా మారింది. ‘ఆయే మిలన్ కీ బేలా’, ‘ఫూల్ ఔర్ పత్తర్’, ‘ఆయే దిన్ బహర్ కే’ వంటి చిత్రాలతో 60ల దశకంలోనే స్టార్ ఇమేజ్‌ను సంపాదించారు. 1960 నుంచి 80ల మధ్యకాలంలో హీరోగా అగ్రస్థానంలో నిలిచారు. ‘షోలే’, ‘యాదోంకి బారాత్’, ‘సీతా ఔర్ గీత’, ‘మేరా గావ్ మేరా దేశ్’, ‘ధర్మ వీర్’ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖ్యాతిని ఆకాశానికి చేర్చాయి.

1973 ఆయన కెరీర్‌లో అత్యంత లక్కీ ఇయర్‌గా నిలిచింది ఒక్క ఏడాదిలోనే ఎనిమిది బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. 1987లో వరుసగా ఏడు సూపర్ హిట్స్ సాధించి అరుదైన రికార్డులు నెలకొల్పారు. ఒకే ఏడాది తొమ్మిది హిట్ సినిమాల్లో నటించిన ఘనత కూడా ఆయన ఖాతాలోనే ఉంది. అప్పట్లో మూడు, నాలుగు షిఫ్టుల్లో పనిచేస్తూ నిరంతరం సినిమాల్లో బిజీగా ఉండేవారు. తొలుత‌ రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధర్మేంద్ర, 1970 తర్వాత యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘షోలే’ తర్వాత ఆయన స్టార్ స్టేటస్ మరింత పెరిగింది. డూప్ లేకుండా స్టంట్స్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనను అభిమానులు ‘హీ మ్యాన్’, ‘యాక్షన్ కింగ్’ అని పిలిచేవారు. అయితే.. ఇటీవల ధర్మేంద్ర జీవిత కథను ఆధారంగా బయోపిక్ తెరకెక్కించాలనే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆయన “నా పాత్రకు సమానంగా నటించగల నటుడు ఇప్పటివరకు కనిపించలేదు” అని వినయంగా వాటిని తిరస్కరించారు.

Updated Date - Jan 25 , 2026 | 11:28 PM