Dharmendra: విలక్షణ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:06 PM
నేడు చిత్రసీమలో ఎందరో కండలవీరులు స్టార్ హీరోస్ గా రాణిస్తున్నారు. హిందీ సినిమారంగంలో అలాంటి స్టేటస్ చూసి 'మ్యాచో మేన్'గా జేజేలు అందుకున్న తొలి స్టార్ హీరో ధర్మేంద్ర (Dharmendra) అనే చెప్పాలి.
Dharmendra: నేడు చిత్రసీమలో ఎందరో కండలవీరులు స్టార్ హీరోస్ గా రాణిస్తున్నారు. హిందీ సినిమారంగంలో అలాంటి స్టేటస్ చూసి 'మ్యాచో మేన్'గా జేజేలు అందుకున్న తొలి స్టార్ హీరో ధర్మేంద్ర (Dharmendra) అనే చెప్పాలి. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ సెవెంటీ ఎమ్.ఎమ్. డేస్ దాకా ధర్మేంద్ర తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 ఏళ్ళు. ఆయన భార్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని(Hema Malini), తనయులు సన్నీ డియోల్ (Sunny Deol), బాబీ డియోల్(Bobby Deol), కూతుళ్ళు ఇషా, అహనా ఉన్నారు.
హిందీ చిత్రసీమలో తనదైన బాణీ పలికించిన ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు... మరో రెండు వారాల్లో 90 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూయడంతో హిందీ సినిమారంగంలో ఓ శకం ముగిసింది. గత కొన్నాళ్ళుగా ధర్మేంద్ర వయసురీత్యా తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించగానే, ధర్మేంద్ర కన్నుమూశారన్న ప్రచారం సాగింది. దానిని కుటుంబ సభ్యులు ఖండించారు. తరువాత కొద్ది రోజులు ఇంట్లోనే చికిత్స పొందుతూ ధర్మేంద్ర సోమవారం కన్నుమూశారు. ఆయన మరణవార్త వినగానే బాలీవుడ్ లో విషాధఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల భారతప్రధాని నరేంద్ర మోడీ, పలువురు మంత్రులు, సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8వ తేదీన ధర్మేంద్ర జన్మించారు. ఆయన తండ్రి ఓ స్కూల్ లో హెడ్మాస్టర్ గా పనిచేసేవారు. ధర్మేంద్ర కూడా తండ్రి వద్ద చదువుకొనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. మెట్రిక్యూలేషన్ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలోనే సాగారు. 1954లో ప్రకాశ్ కౌర్ తో ధర్మేంద్ర వివాహం జరిగింది. తరువాత రకరకాల కాస్ట్యూమ్స్ తో ఫోటోలు తీయించుకొని హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ధర్మేంద్ర ముంబై చేరారు. అదే సమయంలో 'ఫిలిమ్ ఫేర్' మేగజైన్ న్యూ టాలెంట్ సర్చ్ నిర్వహించగా అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. 1960లో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరే' సినిమాతో తొలిసారి ధర్మేంద్ర తెరపై కనిపించారు. "షోలా ఔర్ షబ్నమ్ (1961), అన్ పడ్ (1962), బందిని (1963)" ధర్మేంద్రకు నటునిగా గుర్తింపు లభించింది. రాజేంద్ర కుమార్ హీరోగా నటించిన 'ఆయీ మిలన్ కీ బేలా'లో ప్రతినాయకునిగా నటించి మంచి మార్కులు సంపాదించారు ధర్మేంద్ర. ఆ పై 1966లో 'ఫూల్ ఔర్ పత్తర్'లో హీరోగా నటించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ఆధారంగా తెలుగులో యన్టీఆర్ హీరోగా 'నిండుమనసులు' (1967) చిత్రం తెరకెక్కి విజయం చేజిక్కించుకుంది. "షికార్, ఇజ్జత్, ఆంఖే, ఆద్మీ ఔర్ ఇన్ సాన్, సత్యకామ్, మేరా గావ్ మేరా దేశ్, సీతా ఔర్ గీతా, దోస్త్, యాదోంకీ బారాత్, జుగ్ను, షోలే, మా, చరస్" వంటి సూపర్ హిట్ మూవీస్ లో ధర్మేంద్ర నటించారు.
తనకు హిట్ పెయిర్ గా సాగిన హేమామాలినిని ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో భార్యాబిడ్డలు ఉండి మరో పెళ్ళి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అయితే ముస్లిమ్ సంప్రదాయంలో పెళ్ళి చేసుకోవడంతో ఆ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టారు ధర్మేంద్ర, హేమామాలిని జోడీ. వయసు మీద పడ్డా తరువాతి రోజుల్లోనూ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ సాగారు ధర్మేంద్ర. ఈ యేడాది 'ఇక్కిస్' అనే చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించారు ధర్మేంద్ర. ఈ సినిమా డిసెంబర్ 26న విడుదల కానుంది.
ధర్మేంద్ర రెండో భార్య హేమామాలిని, తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కూతుళ్ళు ఇషా డియోల్, అహనా డియోల్ - అందరూ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేసినవారే కావడం విశేషం...
తెలుగువారితో ధర్మేంద్రకు మంచి అనుబంధం ఉంది. తెలుగు వారు నిర్మించిన "జానీ దోస్త్, వీరూ దాదా"వంటి చిత్రాల్లో నటించారు... తెలుగు దర్శకుడు తాతినేని ప్రకాశరావు రూపొందించిన 'ఇజ్జత్' సినిమాలో ధర్మేంద్ర ద్విపాత్రాభినయం చేసి అలరించారు. నటరత్న యన్టీఆర్ తన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ సాంగ్స్ ను ధర్మేంద్ర రికార్డింగ్ థియేటర్ లోనే రూపొందించడం విశేషం... ఇలా తెలుగు చిత్రసీమతోనూ అనుబంధం ఉన్న ధర్మేంద్ర 200పైగా చిత్రాల్లో నటించారు. యాక్షన్ ఇమేజ్ తో సాగుతూనే కామెడీని మిళితం చేసి పాత్రలను రంజింప చేయడంలో ధర్మేంద్ర తనదైన బాణీ పలికించారు. పలు మల్టీస్టారర్స్ లో నటించిన ధర్మేంద్రకు అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నా, వినోద్ ఖన్నా, జితేంద్ర వంటి స్టార్స్ ఎంతో గౌరవమిచ్చేవారు. తరువాతి రోజుల్లో అనేకమంది బాలీవుడ్ హీరోస్ ధర్మేంద్ర బాణీలోనే కామెడీని మిక్స్ చేసి తమకు లభించిన పాత్రలను రక్తి కట్టించారు. అమితాబ్ బచ్చన్ సైతం 'షోలే'లో ధర్మేంద్ర తో కలసి నటించి, ఆ పై ఆయన పంథాలోనే హాస్యం పండిస్తూ యాక్షన్ రోల్స్ పోషించడం విశేషం. ఏది ఏమైనా ధర్మేంద్ర మరణంతో ఓ శకం ముగిసిందని చెప్పవచ్చు.