తరుణ్ భాస్కర్‌లో ఇంతటి ఆవేశానికి కారణమేంటి?
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:11 AM
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన సహజ కథనంతో న్యూ-ఏజ్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు ప్రకటించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన సహజ కథనంతో న్యూ-ఏజ్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు ప్రకటించారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి చిత్రాలతో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన, తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) చిత్రంతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ చేసిన ఫైర్ స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. తనను తక్కువ అంచనా వేస్తున్న వారికి, ఇండస్ట్రీ లెక్కలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
సక్సెస్ మీట్‌లో తరుణ్ భాస్కర్ ఎంతో ఆవేశంతో మాట్లాడుతూ.. ‘‘ఇన్నాళ్లూ నేను తీసిన సినిమాలన్నింటిలో డబ్బుకు పెద్ద విలువ లేదని, డబ్బును ఫాలో అవ్వొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను డబ్బునే ఫాలో అవుతాను. ఎందుకంటే అందరూ లైన్‌లో నిలబడాలి! ఇకపై నా తదుపరి సినిమాల నుంచి కేవలం ఒక వర్గం ఆడియన్స్ మాత్రమే కాకుండా ఏ, బీ, సీ సెంటర్లన్నింటినీ ఫోకస్ చేసే సినిమాలు తీస్తాను’’ అని కుండబద్దలు కొట్టారు.
ఇండస్ట్రీలో తనను తక్కువ అంచనా వేస్తున్న వారిపై తరుణ్ భాస్కర్ స్పందిస్తూ.. ‘‘ఇక్కడ చాలా మంది చాలా తక్కువ అంచనాలు వేస్తున్నారు కదా.. ఒక ఆథెంటిక్ వాయిస్ ఎంత దూరం వెళ్తుందో చూపిస్తా. ఇప్పటి నుంచి నేను డ్యూటీ ఎక్కుతున్నా.. ఇక దిగే ప్రసక్తే లేదు! నేను మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడమ్ అని పిలవను. నాకు జనమే బలం.. జనం లోపలికి దూరి ఏ, బీ, సీ సెంటర్లు కొడతాను. రాసిపెట్టుకోండి!’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాకుండా తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ.. ‘‘నేను డైరెక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా పూర్తి శ్రద్ధతో చేస్తాను. మన వాయిస్ ఏంటి, ఈక్వాలిటీ ఏంటి అనేది చూపిస్తాను. ఎక్కడైనా ఏమైనా తప్పు జరిగినా, సినిమా ద్వారానే దాన్ని కరెక్ట్ చేస్తా. నాకు ఎవరూ లేరు.. రజనీకాంత్ డైలాగ్ లాగా ‘ఆండవన్ ఇరుక్కాన్’ (దేవుడు ఉన్నాడు), అట్లానే నాకు ప్రేక్షకులు ఉన్నారు. మేము దిల్ సే కల్తీ లేకుండా ప్రేమ ఇస్తూనే ఉంటాం.. మీరు కూడా మాకు ప్రేమ వాపస్ ఇవ్వండి, ఎవడు ఆపుతాడో చూసుకుంటా!’’ అని తరుణ్ భాస్కర్ ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. మొత్తానికి సహజ సిద్ధమైన కోణాన్ని కొనసాగిస్తూనే, బాక్సాఫీస్ వద్ద మాస్ కమర్షియల్ సత్తా చాటేందుకు తరుణ్ భాస్కర్ రంగంలోకి దిగినట్లు ఈ స్పీచ్‌తో స్పష్టమైంది.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. నెట్టింట క్రేజీ పిక్ వైరల్
‘నాన్న కుట్టి’ ఫస్ట్ హాఫ్ బేస్.. సెకండాఫ్ ఎమోషన్: విజయ్ ఆంటోని
కచ్చితంగా నో చెప్తా.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ బోల్డ్ ఆన్సర్