Little Hearts Review: 'లిటిల్ హార్ట్స్' మెప్పించిందా 

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:14 AM

అఖిల్‌ (మౌళి) ఓ మాదిరిగా చదివే బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌. తన తండ్రి గోపాలరావు (రాజీవ్‌ కనకాల) కొడుకుతో బీటెక్‌ చేయించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చూడాలని కలలు కంటుంటాడు. ఎంసెట్‌ ర్యాంక్‌ రాకపోవడం పెట్టాల్సిన చివాట్లు పెట్టి ఎంసెట్‌ లాంగ్‌ టర్మ్‌ కోర్స్‌ చేయిస్తాడు

సినిమా రివ్యూ: లిటిల్‌ హార్ట్స్‌ (Little Hearts Review)

విడుదల తేది: 5–9–2025

'90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌' సిరీస్‌తో చక్కని విజయం అందుకున్నారు దర్శకుడు ఆదిత్యా హాసన్‌( aditya Haasan). ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి సాయి మార్తండ్‌ను (Sai marthand) దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'లిటిల్‌ హార్ట్స్‌’(Little HEarts) '90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌'’ ఫేం మౌళి తనూజ్‌, 'అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్‌' ఫేం శివానీ నాగారం జంటగా నటించారు. రాజీవ్‌ కనకాల, అనితా చౌదరి, ఎస్‌ఎస్‌ కాంచీ, సత్య, నిఖిల్‌ అబ్బూరి, కృష్ణ ఇతర పాత్రధారులు. ఈ చిత్రాన్ని బన్నీవాసు, వంశీ నందిపాటి కలిసి థియేట్రికల్‌గా విడుదల చేశారు. ట్రైలర్‌, టీజర్‌ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందో చూద్దాం...

కథ: (Little Hearts Story)

అఖిల్‌ (మౌళి) ఓ మాదిరిగా చదివే బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌. తన తండ్రి గోపాలరావు (రాజీవ్‌ కనకాల) కొడుకుతో బీటెక్‌ చేయించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చూడాలని కలలు కంటుంటాడు. ఎంసెట్‌ ర్యాంక్‌ రాకపోవడం పెట్టాల్సిన చివాట్లు పెట్టి ఎంసెట్‌ లాంగ్‌ టర్మ్‌ కోర్స్‌ చేయిస్తాడు. మరో పక్క డాక్టర్‌ కృష్ణారావు (ఎస్‌ఎస్‌ కాంచీ).. తన కూతురు కాత్యాయిని (శివానీ నాగారం) డాక్టర్‌ని చేయాలనే తపనతో నాలుగోసారి లాంగ్‌ టర్మ్‌ చేయిస్తాడు. అక్కడ అఖిల్‌కు కాత్యాయిని తారసపడుతుంది. తొలి చూపు నుంచే ఆమె ఫాలో అవుతూ ఇంప్రెస్‌ చేసి ప్రేమలో దించాలనుకుంటాడు. అదే జరుగుతుంది కూడా. ఈలోపు ఇద్దరి మధ్య ట్విస్ట్‌. ఆ ట్విస్ట్‌ ఏంటి? జీవితంలో వీరిద్దరూ అనుకున్నది సాధించారా? వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్లిందా? ఇరు కుటుంబాల తల్లిదండ్రులు ఏం చేశారు ఇది సింపుల్‌గా ఈ సినిమా కథ.


Madhu.jpg

విశ్లేషణ..

2015 సమయంలో సాగే కథ ఇది. ఇంట్లో సరిగా చదవని టీనేజర్స్‌ ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లల ఉన్నతిని కోరుకునే తల్లిదండ్రుల ఆలోచనలు, నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అన్న కథకు రొమాంటిక్‌ లవ్‌స్టోరీ, వినోదాన్ని జోడించి తీసిన సినిమా ఇది. ఇందులో పెద్ద కథేమీ లేదు. అందరికీ తెలిసిన కథే. ఫస్టాఫ్‌ అంతా ఎంసెట్‌ ఎగ్జామ్‌, లాంగ్‌ టర్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కొత్త పరిచయాలు, స్నేహితుల మధ్య సరదా సన్నివేశాలతో సోసోగా సాగిపోయింది. అమ్మాయితో పరిచయం, ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసే సమయానికి హీరోహీరోయిన్‌కి మధ్య ఓ ట్విస్ట్‌. అక్కడితో ఇంటర్వెల్‌ ఇచ్చి కథపై మరింత ఆసక్తి కలిగించాడు దర్శకుడు. (ఆ ట్విస్ట్‌ ఏంటనేది తెరపైనే చూడాలి). అక్కడి నుంచి కథ పరుగులు తీస్తుంది. కథలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా సందర్భానుసారంగా సాగుతుంది. ఎక్కడా బోర్‌ కొట్టడు. ప్రేమకథ, కామెడీ, సెటైర్లు అన్ని ఆధ్యంతం నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. ఇందులో మౌళి చేసిన మ్యూజిక్‌ వీడియో భలే ఫన్‌ క్రియేట్‌ చేసింది. కాలం, పరిస్థితులతో టీనేజర్స్‌ ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తాయి? బలవంతపు చదువులు కాకుండా నచ్చింది చేస్తే ఆ కిక్‌ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇందులో చూపిస్తూ చిన్న సందేశం ఇచ్చారు. తెలిసిన కథో సినిమా అనుకున్నప్పుడు తెరకెక్కించే విధానం, ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేయడానికి తగిన జాగ్రత తీసుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు సాయి మార్తండ్‌ ఫర్ఫెక్ట్‌గా వర్క్‌ చేశాడు. తను ఏం చెప్పాలనుకున్నాడో అదే తెరపై చూపించాడు. క్లైమాక్స్‌ను అటు ఇటు చేయకుండా ఓ ఫ్లోలో జాగ్రత్తగా ట్రీట్‌ చేశాడు.

నటీనటులు – సాంకేతిక నిపుణులు పనితీరు...

అఖిల్‌ పాత్రలో మౌళి ఇరగదీశాడనే చెప్పాలి. ఆ పాత్రలకు అతని సెలెక్షన్‌ పర్ఫెక్ట్‌ అనిపించింది. డైలాగ్‌ డెలివరీ, కామెడీ టైమింగ్‌, సైటైర్లు అంతా కరెక్ట్‌గా కుదిరాయి నటన పరంగానూ వందకు వంద మార్కులు వేయవచ్చు. హీరోయిన్‌ శివానీ నాగరం కూడా పర్ఫెక్ట్‌ యాప్ట్‌ అనే చెప్పాలి. కాత్యాయిని పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తెరపై ఎంతో చలాకీగా కనిపించింది. మౌళి స్నేహితులుగా నటించిన సాయి(మధు), మిర్చి చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నిఖిల్‌ అబ్బూరికి మంచి పాత్రలు దక్కాయి. సాయి కామెడీ టైమింగ్‌ బావుంది. మరో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ రాజా ప్రజ్వల్‌ కూడా బాగా చేశాడు. ఈ మధ్యకాలంలో ఏ ఓటీటీ సిరీస్‌ చూసిన రాజీవ్‌ కనకాల పక్కాగా ఉంటున్నారు. ఇందులో గోపాలరావుగా చక్కని నటన కనబర్చారు. అలాగే ఎస్‌ఎస్‌ కాంచీ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. అనితా చౌదరి, సత్యకృష్ణన్‌ పరిధి మేరకు నటించారు. దర్శకుడి రాత, తీత కూడా బావుంది. మాటలు ఆకట్టుకున్నాయి. సింజిత్‌ ఎర్రమిల్లి సంగీతం ప్లెజంట్‌గా ఉంది. కథకు తగ్గట్టు సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది. ఎడిటర్‌ శ్రీధర్‌ ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే అది పరుగులు తీసేది. నిర్మాణ విలువలు బావున్నాయి. అయితే అక్కడక్కడా ఓటీటీ సినిమా అనే భావన కలుగుతుంది. నిర్మాతలు బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్‌ బాధ్యతలు తీసుకోవడంతో సినిమా రూపు మారిపోయింది. పక్కాగా ఈతరానికి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చే క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకుని థియేటర్‌ నుంచి బయటకు రావచ్చు. నిర్మాతకు కాసుల వర్షం కూడా కురిపిస్తుంది.

ట్యాగ్‌లైన్‌: క్లీన్‌ ఎంటర్‌టైనర్‌.. పైసా వసూల్‌..

రేటింగ్‌: 3/5

Updated Date - Sep 05 , 2025 | 12:40 AM