ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన విశ్వక్ సేన్.. ఎందుకంటే?
ABN, Publish Date - Oct 25 , 2026 | 06:49 PM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతూ ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) తన అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతూ ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు. అభిమానుల (Fans)తో నిర్వహించిన ఫోటో సెషన్ కార్యక్రమంలో ఊహించని విధంగా గందరగోళం నెలకొనడం, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది అభిమానులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ మేరకు విశ్వక్ సేన్ విడుదల చేసిన లేఖలో.. ‘‘నా ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. ప్లాన్ చేసిన ఫ్యాన్స్ ఫోటో సెషన్ సమయంలో మీకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మీ నుంచి వచ్చిన విపరీతమైన స్పందన, మీరు చూపించిన ప్రేమ.. మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఏర్పాట్లలో ఉన్న పరిమితుల వల్ల ఒక్కసారిగా భారీగా తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ మేనేజ్ చేయడం సాధ్యపడలేదు. కొంతమందిని కలిసే క్రమంలో పరిస్థితి క్రౌడ్ కంట్రోల్ చేయలేనంతగా చేయి దాటిపోయింది. ప్రతి ఒక్కరికీ నన్ను కలిసి ఫోటో తీసుకునే సమాన అవకాశం కల్పించలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓపిగ్గా ఎదురుచూసి కూడా ఫోటో దిగే అవకాశం దక్కక నిరాశతో వెనుదిరిగిన అభిమానుల బాధ తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో అభిమానులకు ఓ హామీ ఇస్తూ.. అతి త్వరలోనే మరింత మెరుగైన ప్రణాళిక, పక్కా క్రౌడ్ మేనేజ్మెంట్, సరైన ఏర్పాట్లతో మరోసారి ఫ్యాన్స్ ఫోటో సెషన్‌ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమంలో ఎలాంటి తోపులాటలు, ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని విశ్వక్ సేన్ తన లేఖలో పేర్కొన్నారు. అభిమానుల మనోభావాలను గుర్తించి స్వయంగా హీరోనే ఇంత హుందాగా క్షమాపణ చెప్పడంతో.. హర్ట్ అయిన వారు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
నాని ‘ద ప్యారడైజ్’కు.. మహేష్ తనయుడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా?
‘జనవరి 12 విడుదల’ షాకింగ్ బిజినెస్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కానా?
ఆర్ఆర్ఆర్ కంటే వారణాసి పెద్ద సినిమా.. జక్కన్న సంచలన కామెంట్స్