Nani: ఇంకో 15 ఏళ్లు.. డూప్‌తో పనిలేదు
ABN, Publish Date - Sep 21 , 2026 | 07:35 AM
‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన ప్రేక్షకులకు తల్లీ కొడుకుల ఎమోషన్ విపరీతంగా కనెక్ట్ అవుతుందని హీరో నాని అన్నారు.
‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రంలో పాటలు, ఫైట్లు, ఇంపార్టెంట్ సీన్లు అన్నిటినీ జనాలు ఎంజాయ్ చేస్తారు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు తల్లీ కొడుకుల ఎమోషన్ విపరీతంగా కనెక్ట్ అవుతుంది. కనీసం రెండు మూడు రోజుల పాటు దాని గురించే ఆలోచిస్తుంటారు’ అని హీరో నాని (Nani) అన్నారు. ఆయన నటించిన ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
నాని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ‘శ్రీకాంత్ ఈ కథ చెప్పగానే నచ్చేసింది. లుక్‌లో కనిపించే ప్రతి విషయానికీ సినిమాలో ఓ స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. జడలు, ముక్కుపుడక, బొట్టు.. ప్రతి విషయానికీ స్పెషల్ మీనింగ్ ఉంటుంది. 1984-85ల్లో కథ నడుస్తుంటుంది. ఫిక్షనల్‌గా క్రియేట్ చేసిన సవారీ తెగకు చెందిన వాళ్ల జీవితాల నేపథ్యంలో సాగుతుంది. ఈ తెగకు ఎలాంటి గుర్తింపూ ఉండదు. వాళ్లు ఎవరినైౖనా చంపినా కేసు కాదు. వాళ్లకు ఏమైనా జరిగినా ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాళ్లల్లో పుట్టిన జడల్ ఏం చేశాడనేది ఆసక్తికరం.
ఈ సినిమాలో మోహన్‌బాబుగారు సికంజా మాలిక్ అనే క్రూరమైన పాత్రలో కనిపిస్తారు. జడల్ పాత్ర మేకప్ గురించి మాట్లాడుతూ ‘ప్రతి రోజూ మేకప్ వేసుకోవడానికి గంటన్నర సమయం పట్టేది. జడల వల్ల వెనక్కి ఆనుకుని కూర్చోలేకపోయేవాడిని. ఎటూ కదలడానికి వీల్లేకపోవడంతో నిటారుగా ఉండాల్సి వచ్చేది. జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. అయినా ఓపిక ఉంది కాబట్టి ఇష్టంగా చేశాను. ఇంకో 15 ఏళ్ల తర్వాత డూప్‌లకు కొన్ని అప్పజెబుతానేమో. ఇప్పటివరకైతే నా సినిమాల్లో డూప్‌లు కనిపిస్తే నేను ఎంజాయ్ చేయలేను’ అని అన్నారు.
పాటల గురించి స్పందిస్తూ ‘తెలంగాణ జానపదాల మీద శ్రీకాంత్‌కి పట్టుంది. సంగీతం గురించి అనిరుధ్‌కి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. వారిద్దరూ కలిసి చేసిన ప్రాజక్ట్ కాబట్టి ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలు వచ్చాయి’ అని చెప్పారు. ‘చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకుంటే కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందా’ అని ప్రశ్నించగా ‘‘పుష్ప’ డిలే అయినంత మాత్రాన సుకుమార్‌గారికి ఎఫెక్ట్ అయిందా? అలాంటిదేమీ ఉండదు. క్వాలిటీ ప్రాడక్ట్ డెలివరీ చేస్తే ఇమేజ్ మరింత పెరుగుతుందే తప్ప దెబ్బతినదు. క్వాలిటీ ప్రాడక్ట్ ఇవ్వడంలో శ్రీకాంత్ ఎప్పుడూ ముందుంటాడు’ అని అన్నారు.