రాజమౌళి సెంటిమెంట్.. ‘కుంభ’ బ‌ల ప‌డ‌తాడా లేక బలవుతాడా?

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:56 PM

ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన మాస్టర్ స్టోరీ టెల్లర్ జక్కన్న సెంటిమెంట్‌పై సోషల్ మీడియాలో చర్చ మ‌ళ్లీ మొదలైంది.

SS Rajamouli

భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. కేవలం టాలీవుడ్ స్థాయిని మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన మాస్టర్ స్టోరీ టెల్లర్ 'జక్కన్న'. రాజమౌళి కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే, టాలీవుడ్‌లో రాజమౌళి సెంటిమెంట్ అంటూ ఒకటి ప్రచారంలో ఉంది. అదేంటంటే.. జక్కన్నతో సినిమా చేసిన తర్వాత హీరోలు వెంటనే తమ తదుపరి చిత్రాలతో ఫ్లాప్ చూస్తారనేది.

రాజమౌళి ఫస్ట్ మూవీ 'స్టూడెంట్ నెంబర్ 1' తర్వాత ఎన్టీఆర్ చేసిన 'సుబ్బు' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేక పోయింది. అలాగే 'సింహాద్రి' తర్వాత 'ఆంధ్రావాలా', 'యమదొంగ' తర్వాత 'కంత్రీ'... ఇలా మూడూ కూడా ఫెయిలైన సినిమాలే. అటు 'సై' సినిమా తర్వాత నితిన్ వరుసగా ప్లాపులు చూశాడు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ 'ఛత్రపతి' తర్వాత 'పౌర్ణమి', అలాగే 'బాహుబలి' సిరీస్ తర్వాత వచ్చిన 'సాహో' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'మగధీర' తర్వాత 'ఆరెంజ్', 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత 'ఆచార్య' వంటి పరాజయాలను చవిచూశారు. ఇలా ప్రతీసారి రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్స్ రావడం అనేది ఒక అన్‌అఫీషియల్ సెంటిమెంట్‌గా మారిపోయింది.

ఇక ప్రస్తుతం రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో వారణాసి (Varanasi) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ పాన్-వరల్డ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంటే.. మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన విలన్ పాత్ర పోషిస్తున్నారు. అయితే, 'వారణాసి' విడుదల కాకముందే ఈ జక్కన్న సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా రాజమౌళి సినిమా రిలీజైన తర్వాతే ఆ హీరో తదుపరి సినిమాపై ఈ ప్రభావం పడుతుంది. కానీ ఈసారి విలన్ పాత్ర చేస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ విషయంలో మాత్రం 'వారణాసి' మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే ఈ చర్చ నడుస్తోంది.

'వారణాసి' చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల పృథ్విరాజ్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో రాజమౌళి సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే, పృథ్విరాజ్ పైకి ఈ రాజమౌళి సెంటిమెంట్ ప్రభావం పడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ 'వారణాసి' సినిమా పృథ్విరాజ్ కెరీర్‌కు ఏవిధంగా ఉపయోగపడుతుందనేది! 'వారణాసి'లోని 'కుంభ' పాత్ర చాలా ప్రాముఖ్యత ఉన్నదిగా తెలుస్తోంది. దీంతో ఆయనకు పాన్-వరల్డ్ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. మరి ఈ 'కుంభ' పాత్ర ఆయనకు ఎలాంటి ప్రశంసలు తెచ్చిపెడుతుంది? 'వారణాసి' తర్వాత ఆయన కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది వేచి చూడాలి!

Updated Date - Sep 20 , 2026 | 07:14 PM