పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:21 PM

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే చాలు.. మన కళ్లముందు కదిలే తొలి రూపం అనుష్క శెట్టి.

Anushka Shetty

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే చాలు.. మన కళ్లముందు కదిలే తొలి రూపం అనుష్క శెట్టి (Anushka Shetty) . కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, తన అద్భుతమైన నటనతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన స్టార్ హీరోయిన్. ‘జేజమ్మ’గా అరుంధతిలో ఆమె చూపించిన రౌద్రం, భాగమతిలో ఆమె సృష్టించిన భయం, థ్రిల్.. సినీ ప్రియుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌ను సంపాదించుకుని, హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ రాబట్టిన అతికొద్ది మంది తారల్లో అనుష్క మొదటి వరుసలో ఉంటుంది. కానీ, ఇంతటి భారీ స్టార్‌డమ్ చూసిన ఈ టాలీవుడ్ దేవసేన.. గత కొంత కాలంగా ఇండస్ట్రీలో పూర్తిగా సైలెంట్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బాహుబలి-2 తరువాత అందరూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంటే అనుష్క మాత్రం 6 సినిమాలలో మాత్రమే నటించింది. అందులో సైరా నరసింహారెడ్డిలో అతిథి పాత్రే.. వీటిలో గతేడాది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఘాటీ’ అనే సినిమా చేసింది. అలాగే మలయాళంలో జయసూర్యతో కలిసి ‘కథనార్’ అనే భారీ ఫాంటసీ డ్రామాలో కూడా నటించింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులు మినహా, ఆ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్‌కు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో నిత్యం సెట్స్‌పై బిజీగా గడిపిన ఈ లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు కథల ఎంపికలో విపరీతమైన సెలెక్టివ్‌గా మారారా..? లేక పూర్తిగా సినిమాలకు దూరంగా జరగాలని ఆలోచిస్తున్నారా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

కొత్త సినిమా అప్‌డేట్స్ ఏవీ రాకపోవడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ ఏ రేంజ్‌లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు చారిత్రక వీరులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరిస్తూ మేకర్స్ బ్లాక్‌బస్టర్లు కొడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో అనుష్క లాంటి ప్రతిభావంతురాలైన నటికి ఒక్క బయోపిక్ ఆఫర్ కూడా రాకపోవడం విస్మయానికి గురిచేసే విషయం.

చారిత్రక పాత్రలకు ప్రాణం పోయడంలో ఆమె శైలే వేరు. ‘రుద్రమదేవి’ లాంటి భారీ పీరియాడికల్ డ్రామాలో వీరనారిగా గుర్రపు స్వారీ చేస్తూ, కత్తి పట్టి యుద్ధం చేసి మెప్పించింది. అలాగే ‘బాహుబలి’లో దేవసేనగా రాజసం, పౌరుషం, కన్నీరు కలబోసిన పాత్రలో జీవించేసింది. పాత్ర కోసం ఎంతటి శారీరక శ్రమనైనా ఓర్చుకునే తత్వం అనుష్క సొంతం. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగి, ఆ తర్వాత తగ్గడానికి ఆమె పడిన కష్టం చిత్రసీమలో ఒక ఉదాహరణగా నిలిచింది. అలాంటి డెడికేషన్ ఉన్న నటికి ప్రస్తుతం వస్తున్న బయోపిక్స్‌లో ఎందుకు స్థానం దక్కడం లేదు.

ప్రస్తుతం వస్తున్న చాలావరకు బయోపిక్స్ వాస్తవికతకు దగ్గరగా, రియలిస్టిక్ డ్రామాలుగా తెరకెక్కుతున్నాయి. కానీ అనుష్క ఇమేజ్ చాలా పెద్దది. భారీ తెరపై ఆమె కనిపించినప్పుడు ప్రేక్షకులు లార్జర్ దేన్ లైఫ్ ఎమోషన్స్‌ను ఆశిస్తారు. ఆ ఇమేజ్‌కు సరిపోయే స్థాయి రియల్ క్యారెక్టర్లు దొరకడం కష్టంగా మారడం ఒక కారణం కావచ్చు. రెండోది.. ఇండస్ట్రీలో బలంగా చక్కర్లు కొడుతున్న ఒక టాక్. అనుష్క ఇకపై పెద్దగా సినిమాలు చేయకపోవచ్చని, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టి కెరీర్‌ను ముగించే యోచనలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ప్రశాంతమైన జీవనశైలిని ఎంచుకోవడం వల్లే కొత్త కథలు వినడానికి కూడా ఆమె ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒక స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఇలా ఉన్నట్టుండి పూర్తిగా మౌనంగా మారిపోవడం నిజంగా చర్చనీయాంశమే. అయితే అనుష్క స్థాయి క్రేజ్ ఉన్న హీరోయిన్‌కు సరైన సబ్జెక్ట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ వస్తుందో గతంలో చాలాసార్లు రుజువైంది. మరి రానున్న రోజుల్లో అనుష్క వ్యక్తిత్వానికి, ఆమె నటనా వైభవానికి సరిపోయే ఒక తిరుగులేని పవర్ ఫుల్ ప్రాజెక్ట్ వస్తుందా..? లేక ఈ మౌనం నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పే సంకేతమా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Updated Date - Sep 20 , 2026 | 03:21 PM