‘జననాయగన్’ లీక్.. ఎడిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
ABN, Publish Date - Apr 25 , 2026 | 12:02 PM
కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీపై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఈ మూవీని పైరసీ చేసిన ఎడిటర్‌పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) మూవీపై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటోన్న ఈ ‘జననాయగన్’ మూవీని.. విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేసిన ఫ్రీలాన్స్ ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్ (Pradeep e Ragav)పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ లీక్ వ్యవహారంలో రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి.. మొదట ఆరుగురుని, ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేయగా.. వీరిలో ప్రదీప్ ఇ.రాఘవ్ ఒకరు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ నుంచి అతడిని సస్పెండ్ చేస్తున్నట్లుగా.. ఈ అసోసియేషన్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న ప్రదీప్ ఇ.రాఘవ్.. మరో సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ‘జననాయగన్’ సినిమా ఎడిటింగ్ స్టూడియోలో అతనికి అనుమతి లేనప్పటికీ, అనధికారికంగా సినిమా రీల్స్‌ను యాక్సెస్ చేసి డేటాను దొంగిలించినట్లుగా సైబర్ క్రైమ్ విభాగం కనుగొంది. ఆ దొంగిలించిన డేటాను సినిమాగా మార్చి, తన సహ నిందితులకు షేర్ చేశాడని, దీంతో ఆ పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో విపరీతంగా వ్యాప్తి చెందాయని ఇంతకు ముందు సైబర్ క్రైమ్ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘జననాయగన్’ లీక్ బాధాకరం
హెచ్. వినోద్ దర్శకత్వంలో అగ్ర హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీలోని సన్నివేశాలు లీకవడం బాధాకరమని హీరోయిన్ మమిత బైజు (Mamitha Baiju) అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ.. ‘ఇది చాలా నిరాశాజనకం. బాధాకరంగా ఉంది. ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలున్నాయి. ఎంతో మంది శ్రమ దాగి వుంది. సినిమా లీక్‌పై ఆరంభంలో సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని నేను నమ్మలేదు. ఆ తర్వాత నా సోదరుడు చెప్పగా ఆశ్చర్యపోయాను. రూ. కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీకవడం చాలా దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రను పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా, సెన్సార్ వివాదం కారణంగా సినిమా విడుదలకు నోచుకోని విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!