Jana Nayagan: ఆ ఒక్కడి అభ్యంతరం.. జన నాయగన్ వాయిదా! కోట్ల న‌ష్టం

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:44 AM

విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా పడింది. సెన్సార్ బృందంలోని ఒక సభ్యుడి అభ్యంతరం మేరకు ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి సిఫార్స్ చేశారని తెలిసింది.

Jana Nayagan Movie

దళపతి విజయ్ (Vijay) కు రాజకీయాల్లోకి వచ్చాకే కాదు... రాకముందు కూడా ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. జయలలిత (Jayalalitha) అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయ్ సినిమాల విడుదలకు ముందు రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా విజయ్ కు ఎలాంటి సహకారం అందేది కాదు. దాంతో విజయ్, అతని అభిమానులు ఒంటరి పోరాటం చేసి సినిమాలను విజయపథంలో నడపడానికి ప్రయత్నించే వారు. ఇక ఇప్పుడు సొంత పార్టీ పెట్టి, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఏంకే ప్రభుత్వంతోనూ, కేంద్రంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వంతోనూ విజయ్ ఢీ అంటే ఢీ అనడంతో రెండు చోట్ల నుండి అతనికి మద్దత్తు కరువైందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా... చివరి నిమిషంలో సెన్సార్ సర్టిఫికెట్ రాని కారణంగా విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతో మూవీ విడుదల పోస్ట్ పోన్ చేశామని నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్ తెలిపింది.

WhatsApp Image 2026-01-07 at 11.17.45 PM.jpeg

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో విజయ్ కు మద్దత్తు పెరిగింది. పలువురు సినిమా ప్రముఖులు విజయ్ కు నైతిక మద్దత్తును ఇస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 'డిమాంటీ కాలనీ' ఫ్రాంచైజ్ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ విషయమై తీవ్రంగా స్పందించాడు. ఇది అధికార దుర్వినియోగం తప్పితే మరొకటి కాదని, సినిమా అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిందనుకోవడం పొరపాటని, వందలాది మంది శ్రమ, ధనం అందులో ఉంటాయని తెలిపాడు. విజయ్ చివరి చిత్రంగా వస్తున్న 'జన నాయగన్' ఎప్పుడు విడుదలైనా తాము పండగ చేసుకుంటామని అన్నాడు. ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్, 'దర్బార్' ఫేమ్ జాన్ సైతం విజయ్ కు దన్నుగా నిలిచాడు. ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి కూడా దీనిపై స్పందించాడు. 'జన నాయగన్' విడుదల కాకుండా జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఆ సినిమాకు అఖండ విజయాన్ని కట్టబెడతాయని చెప్పాడు. 'మేయాద మాన్' దర్శకుడు రత్న కుమార్ విజయ్ కు సంఘీభావం తెలిపాడు. 'పెద్ద సినిమాలు విడుదల కాకుండా వాయిదా పడటం అనేది చాలా బాధాకరమని, తమిళ చిత్రసీమ ప్రమాదంలో ఉంద'నిపిస్తోందని వ్యాఖ్యానించాడు. హీరో రవి మోహన్ సైతం విజయ్ కు సపోర్ట్ గా నిలిచాడు. విజయ్ సినిమా ఎప్పడొస్తే అప్పుడే పండగ అని చెప్పాడు. 'జన నాయగన్' నిర్మాతలు కోర్టుకు వెళ్ళి విడుదలకు మార్గం సుగమం చేసుకోవాలని చూసినా అదీ నెరవేరలేదు.

WhatsApp Image 2026-01-08 at 11.30.36 AM.jpeg


'ఈ సినిమాను సెన్సార్ చేసిన బృందంలోని ఒక సభ్యుడు ఫైనల్ రిపోర్ట్ లో తన అభిప్రాయాలను కమిటీలోని ఇతర సభ్యులు త్రోసిపుచ్చారని సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ కు నేరుగా తెలిపారని, దాంతో ఆయన ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి సిఫార్స్ చేశార'ని అడిషనల్ సోలిసిటైర్ జనరల్ ఎ.ఆర్.ఎల్. సుందరేశన్ కోర్టుకు తెలిపారు. అయితే మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని బేస్ చేసుకుని దీనికి సి.బి.ఎఫ్‌.సి. యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించిందని, కమిటీ కోరిన విధంగా 27 కట్స్ కు, మార్పులకు తాము ఒప్పుకున్నామని కె.వి.యన్. ప్రొడక్షన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ సతీశ్‌ పరాశన్ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలూ విన్న జస్టిస్ ఆశా తీర్పును రిజర్వ్ చేశారు. దాంతో అనివార్యంగా సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

Updated Date - Jan 09 , 2026 | 09:38 AM