Jana Nayagan: ఓపిక లేదా? జన నాయగన్‌పై.. హైకోర్టు ఆగ్రహం! సింగిల్ జడ్జి తీర్పుపై స్టే
ABN , Publish Date - Jan 10 , 2026 | 07:13 AM
హీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం షాకిచ్చింది.
హీరో విజయ్ (Thalapathy Vijay) నటించిన జన నాయగన్ (Jana Nayagan) చిత్రానికి మద్రాస్ హైకోర్టు (Madras High Court) ద్విసభ్య ధర్మాసనం షాకిచ్చింది. ఆ చిత్రానికి తక్షణం సెన్సార్ సర్టిఫికేట్ (censor certificate) ను జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాత్సవ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 9న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ జారీ ఆలస్యమవడంతో చిత్ర నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ పీటీ ఆషా- శుక్రవారం ఉదయం 'జన నాయగన్కు 'యూఏ' సర్టిఫికేట్ మంజూరు చేయాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించారు.
అయితే, సింగిల్ జడ్జి తీర్పుపై సెన్సార్ బోర్డు తక్షణం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. రివ్యూ చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండానే సింగిల్ జడ్జి ఉత్త ర్వులు జారీ చేశారని, వీటిని రద్దు చేయాలని సెన్సార్ బోర్డు అభ్యర్థించింది. అనేక నిబంధనలు పాటించాల్సివున్న తరుణంలో సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఓపిగ్గా వేచి చూడకుండా, న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ పాటికి మీరు విడుదల తేదీని ప్రకటిస్తే మేం మీ ఇష్టానుసారంగా నడుచుకోవాలా? అని నిలదీసింది. సెన్సార్ సర్టిఫికేట్ పొందేందుకు మరికొంత కాలం వేచి చూడొచ్చు కదా అని ప్రశ్నిస్తూ.. సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.