Bunny: ఐకాన్ స్టార్ తో చేతులు కలుపుతున్న విజయ్ సేతుపతి
ABN, Publish Date - Aug 22 , 2025 | 05:50 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీపై రోజు రోజుకూ కొత్త విశేషాలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో రిలీజ్ కాకున్నా, బజ్ మాత్రం క్రియేట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం బన్నీ-అట్లీ సినిమాకు సంబంధించిన మరో విశేషం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.
'పుష్ప' సిరీస్ తో అల్లు అర్జున్ రేంజ్ భలేగా పెరిగింది. మన దేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న స్టార్ గానూ బన్నీ నిలిచారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నటిస్తోన్న అట్లీ మూవీపై అందరి దృష్టి సాగుతోంది. ఈ చిత్రాన్ని 600 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనున్నట్టు వినికిడి. ఇందులో సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్స్ ఉన్నాయనీ సమాచారం. ఈ మూవీ కోసం ముంబైలోని మెహబూబా స్టూడియోస్ లో ప్రత్యేక సెట్ ను నిర్మించారు. అక్కడే గ్రీన్ మ్యాట్ లో కొన్ని సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బన్నీ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఓ పాత్ర మిడిల్ ఏజ్డ్ లో ఉంటుందని వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమిళనాట ఎంతో క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి ఓ ముఖ్యపాత్ర ధరించబోతున్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్, అట్లీ మూవీలో దీపికా పదుకొణే తోపాటు రశ్మిక మందణ్ణ, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ నాయికలుగా కనిపించబోతున్నారు. ఇక రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరంతా ఇందులో నటించడమే ఓ విశేషంగా చెప్పుకుంటూ ఉంటే, ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు కూడా ఇందులో చోటు చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపయింది. నిజానికి 'పుష్ప' సమయంలోనే విజయ్ సేతుపతితో ఓ పాత్రను నటింప చేయాలని ట్రై చేశారట. అయితే అప్పట్లో విజయ్ సేతుపతి నో చెప్పారని వినికిడి. కానీ, ఈ విషయంపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇస్తూ 'పుష్ప' గురించి తనను ఎవరూ సంప్రందించలేదని ఈ మధ్యే చెప్పారు. అందువల్ల ఇప్పుడు అర్జున్-అట్లీ సినిమాలోనైనా విజయ్ సేతుపతి నటిస్తాడా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ విజయ్ సేతుపతి విషయాన్ని వెల్లడిస్తారనీ మరికొందరు చెబుతున్నారు.
'పుష్ప' సిరీస్ తరువాత అల్లు అర్జున్, 'జవాన్' తరువాత అట్లీ కలసి పనిచేస్తోన్న సినిమా కాబట్టి తాజా చిత్రానికి ఉత్తరాదిన సైతం క్రేజ్ నెలకొంది. అందునా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపారు. వీరితో వర్క్ చేయడానికే ముంబైను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ ను ఈ మధ్య గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సీన్ మూవీకి పెద్ద ఎస్సెట్ గా నిలుస్తుందని చిత్రీకరణ చూసిన వారు చెబుతున్నారు. 2026 సెప్టెంబర్ దాకా షూటింగ్ జరుపుకొనే ఈ సినిమా 2027లోనే జనాన్ని పలకరించనుంది. ఆ లోగా ఇంకా ఎన్ని విశేషాలతో ఈ ప్రాజెక్ట్ క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.
Also Read: Shriya Saran: 'మిస్టర్ రోమియో' టీజర్ లాంచ్ చేసిన శ్రియా
Also Read: Anil Ravipudi: రఫ్పాడిస్తాను.. బాక్స్ బద్దలైపోద్ది డైలాగులుంటాయి.. కానీ..