Tollywood: పూజా హెగ్డే డిమాండ్ కు తలొగ్గిన నిర్మాత...
ABN, Publish Date - Oct 07 , 2025 | 01:35 PM
దుల్కర్ సల్మాన్ సినిమాతో తెలుగులోకి పూజా హెగ్డే మూడేళ్ళ తర్వాత రీ-ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసిందని, దానికి మేకర్స్ అంగీకరించారని తెలుస్తోంది.
పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే చిత్రసీమలోకి అడుగుపెట్టి... పుష్కరకాలం దాటిపోయింది. తెలుగు సినిమా రంగంలోకి వచ్చి కూడా పదేళ్ళు అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో యువ కథానాయకులతో జోడీ కట్టిన పూజా హెగ్డే తర్వాత టాప్ స్టార్స్ సరసన అవకాశాలు అందిపుచ్చుకుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరుకుంది. కానీ కొంతకాలంగా ఆమె హవా తెలుగులో తగ్గిపోతూ వచ్చింది. 2022లో పూజా హెగ్డే 'రాధేశ్యామ్', 'ఆచార్య' సినిమాల్లో నటిస్తే... ఈ రెండూ ఫ్లాప్ అయ్యాయి. అదే యేడాది 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నర్తించింది. అలానే తమిళ అనువాద చిత్రం 'బీస్ట్'లోనూ యాక్ట్ చేసింది. ఆపైన పూజా హెగ్డే హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్', 'దేవ' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ హిందీలో వచ్చాయి. కానీ ఇవేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలానే ఈ యేడాది ఆమె నటించిన తమిళ చిత్రాలు 'రెట్రో', 'కూలీ' విడుదల అయ్యాయి. 'కూలీ'లో పూజా హెగ్డే నర్తించిన 'మోనికా' సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక 'రెట్రో' సినిమా చూసిన వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఆ రకంగా గత కొంతకాలంగా పూజా హెగ్డే పలు పరాజయాలతో ప్రయాణం సాగిస్తోంది. తెలుగు స్ట్రయిట్ సినిమాలో పూజా హెగ్డే నటించి ఏకంగా మూడేళ్ళు గడిచిపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో చేయబోతున్న సినిమాతో పూజా హెగ్డే రీ-ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ కోసం ఆమెకు ఏకంగా మూడు కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. రవి నేలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే... ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో పూజా హెగ్డే కు ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇతర చిత్రసీమల్లోనూ మంచి గుర్తింపు ఉండటం వల్లే పూజా హెగ్డే డిమాండ్ కు మేకర్స్ తలవొగ్గారని అంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళంలో 'కాంచన -4', విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'లలో నటిస్తోంది. అలానే చేతిలో ఒకటి రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా... తెలుగులో అసలు క్రేజే లేని ఆమెకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువే అనే వారూ లేకపోలేదు. మరి పూజా హెగ్డేని ఏరికోరి మేకర్స్ తీసుకున్నారంటే... అదేదో సమ్ థింగ్ స్పెషల్ పాత్ర అని మరి కొందరు అంటున్నారు. సక్సెస్ ఫుల్ హీరోగా తెలుగులో పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కారణంగా అయినా... పూజా హెగ్డే కు ఈ రీ-ఎంట్రీ కలిసి వస్తుందేమో చూడాలి.
Also Read: Jr NTR: ఆగిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్...
Also Read: Predator: Badlands: అవతార్3కి ముందే.. థియేటర్లకు మరో విజువల్ వండర్! గెట్ రెడీ