సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం 'ఓజీ'పై పడుతుందా...

ABN, Publish Date - Sep 23 , 2025 | 10:13 AM

పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ లభించడంపై అభిమానులు కొంత నిరాశకు గురిఅయ్యారు. ఈ సర్టిఫికెట్ ప్రభావం మూవీ కలెక్షన్స్ పై ఉంటుందని అనుకుంటున్నారు. 'ఎ' సర్టిఫికెట్ కారణంగా 18 సంవత్సరాల లోపు వారిని థియేటర్లలోకి అనుమతించరు.

OG Movie

పాపులర్ హీరో సినిమాకు సెన్సార్ బోర్డ్ ఆఫ్‌ సర్టిఫికేషన్ 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చిందంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే... స్టార్ అండ్ మాస్ హీరోలకు బోలెడంత మంది పిల్లలు అభిమానులుగా ఉంటారు. తాము అభిమానించే హీరో సినిమాను తప్పనిసరిగా చూడాలని కోరుకుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి హీరో సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందంటే... దాని ప్రభావం కలెక్షన్స్ మీద ఖచ్చితంగా పడుతుంది. 'ఎ' సర్టిఫికెట్ అంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా. అంటే ఆ లోపు వయసు ఉన్న వారు చూడటానికి ఆస్కారం లేదు. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో సినిమాను సహజంగా ఎవరైనా... ఫ్యామిలీతో చూడాలని అనుకుంటారు. పైగా ఇది దసరా పండగ సీజన్ లో వస్తున్న సినిమా. అయితే 'ఎ' సర్టిఫికెట్ కారణంగా ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త గుబులు మొదలైంది. 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో... అందరూ 'ఓజీ' మీదనే ఆశలు పెట్టుకున్నారు. తప్పనిసరిగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని అనుకున్నారు. దానికి తోడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రీమియర్ షోస్ కు అనుమతి లభించడం అక్కడ వెయ్యి రూపాయలు, ఇక్కడ ఎనిమిది వందలు టిక్కెట్ రేట్ పెట్టడంతో... ఈ యేడాది అత్యధిక వసూళ్ళు సాధించే చిత్రంగా 'ఓజీ' నిలుస్తుందని ఆశ పడుతున్నారు. ఈ తరుణంలో 'ఓజీ'కి 'ఎ' సర్టిఫికెట్ రావడం అనేది అశనిపాతమనే చెప్పాలి.


పవన్ కళ్యాణ్‌ మాదిరిగానే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూ చిన్నపిల్లలు ఎంతో మంది అభిమానులుగా ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన 'కూలీ' (Coolie) సినిమాకు సెన్సార్ వాళ్ళు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద బాగా పడింది. రజనీకాంత్ కు డై హార్డ్ ఫ్యాన్స్ అయిన పిల్లలు 'కూలీ' సినిమాను థియేటర్లలో చూడలేకపోయారు. సినిమా విడుదలకు ముందు 'ఎ' సర్టిఫికెట్ తీసుకోవడానికి అంగీకరించిన నిర్మాత... ఆ తర్వాత సెన్సార్ వాళ్లు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ... కోర్టుకెళ్ళారు. కానీ ఇక్కడ 'ఓజీ' పరిస్థితి వేరుగా ఉంది. ఈ సినిమాలోని హింసాత్మక సంఘటన మీద సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారని, కొన్ని సన్నివేశాలు తొలగిస్తే తప్పితే 'యు/ఎ' సర్టిఫికెట్ ఇవ్వలేమని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ మేకర్స్ యాక్షన్ పార్ట్ లోని ఇంటెన్సిటీ తగ్గిపోతుందని, 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చినా ఫర్వాలేదని అన్నట్టు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఆలస్యం కావడం వల్లే సోమవారం రాత్రి వరకూ 'ఓజీ' సర్టిఫికెట్ విషయంలో క్లారిటీ రాలేదని అంటున్నారు.


నిజానికి స్టార్ హీరోల సినిమాలకు సెన్సార్ కార్యక్రమాలను కాస్తంత ముందే పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే... ఆన్ లైన్ లో ఒకసారి టిక్కెట్ల అమ్మకాలు పెట్టిన తర్వాత దానికి 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందని తెలిస్తే... అప్పటికే ఫ్యామిలీలో చిన్న పిల్లలకు కూడా టిక్కెట్లు కొన్నవారి పరిస్థితి దారుణం. 18 సంవత్సరాల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించరు. సో... ఆన్ లైన్ అమ్మకాల కంటే ముందే సెన్సార్ వ్యవహారం పూర్తయితే మంచింది. 'ఓజీ' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ప్రీమియర్స్ కు 18 సంవత్సరాల లోపు పిల్లలు వస్తే... థియేటర్ల యాజమాన్యం ఏమేరకు వారిని నిలువరిస్తుందనే చూడాలి. మల్టీప్లెక్స్ థియేటర్లలో అమలు చేసినట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించిన ఆంక్షలను సింగిల్ స్క్రీన్ లో అమలు చేయరని చాలా మంది చెబుతూ ఉంటారు. ఏదేమైనా... 'ఓజీ' సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా సర్టిఫికెట్ తో నిమిత్తం లేకుండా ఓపెనింగ్స్ అయితే వస్తాయి... కానీ లాంగ్ రన్ మీద 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం ఎంతో కొంత పడుతుందనేది వాస్తవం.

Also Read: Srivishnu: కోన వెంకట్ సమర్పణలో శ్రీవిష్ణు సినిమా

Also Read: Ranbir Kapoor: రణ్‌బీర్‌.. జాతీయ మానవహక్కుల కమిషన్‌

Updated Date - Sep 23 , 2025 | 10:13 AM