OG Censor Report: ఓజీ సెన్సార్ పూర్తి.. ఏపీ జీవోలో మార్పు
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:04 PM
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’ (OG). సోమవారం సెన్సార్ కార్యక్రమాలు (OG Censor) పూర్తయ్యాయి.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’ (OG). సుజీత్ దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు (OG Censor) పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాల 15 సెకన్లు నిడివి ఉంది. ఒరిజినల్ రన్‌టైమ్ 156.10 నిమిషాలు (2 గంటల 36 నిమిషాల 10 సెకన్లు) కాగా సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల అనంతరం తగ్గింది. స్మోకింగ్ సీన్‌కు సంబంధించి డిస్‌క్లయిమర్ ప్రదర్శనతోపాటు వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటి సూచనలతోపాటు కొన్ని హింసాత్మక సన్నివేశాలకు సెన్సార్ బోర్డు ‘కట్’ చెప్పింది. చిత్ర బృందం ఆ మార్పులు చేసింది.
ఏపీ జీవోలో మార్పు..
తెలంగాణాలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. ఆ షో టికెట్ ధర రూ.800 (జీఎస్టీతో కలిపి). ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శన (OG Premieres in AP)కు అవకాశం కల్పించింది. బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రం విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీ సహా) మేరకు అదనంగా పెంచుకొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే వీలు కల్పించింది. (OG Ticket Prices in AP)