Rajamouli: 'బాహుబలి ది ఎపిక్'కు కొత్త నిర్వచనం...
ABN, Publish Date - Aug 28 , 2025 | 10:26 AM
ఓ పాత సినిమా జనం ముందుకు మళ్ళీ వస్తే దానిని 'రీ-రిలీజ్' అనే అంటారు. కానీ, రాజమౌళి తన మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' సిరీస్ ను ఒకటిగా చేసి 'బాహుబలి - ది ఎపిక్'గా రూపొందించారు. దీనిని మాత్రం 'రీ-రిలీజ్' అనకూడదని రాజమౌళి అంటున్నారు. ఎందుకలాగా?
జానపద కథలకు కాలం చెల్లింది అన్న సెంటిమెంట్ ను తుడిచేస్తూ తెలుగునాట 'బాహుబలి' (Baahubali) సిరీస్ తో ఘనవిజయం సాధించారు దర్శకధీర రాజమౌళి (Rajamouli) . 2015 జూలై 10వ తేదీన 'బాహుబలి-ద బిగినింగ్' విడుదల కాగా, 2017 ఏప్రిల్ 28న 'బాహుబలి-ద కంక్లూజన్' జనం ముందు నిలచింది. మొదటి భాగం 650 కోట్లకు పైగా వసూళ్ళు చూస్తే, రెండో భాగం మన దేశంలోనే తొలిసారి వెయ్యి కోట్లు చూసిన చిత్రంగా నిలచింది. అంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న 'బాహుబలి' సిరీస్ ను ఇప్పుడు ఒక్కటిగా చేసి 'బాహుబలి- ది ఎపిక్' ను రూపొందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ రాగానే మరోమారు ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం విశేషంగా మారింది.
'బాహుబలి-1'ను అప్పట్లో పదేళ్ళు పూర్తయిన సందర్భంగా రీ-రిలీజ్ చేస్తారని వినిపించింది. అయితే మేకర్స్ ఆ ప్రతిపాదనను మానుకొని, రెండు భాగాలను కలిపి ఒకటిగా చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తత్ఫలితంగానే 'బాహుబలి- ది ఎపిక్' రూపొందింది. అయితే ఈ సినిమాను రీ-రిలీజ్ అనరాదని మేకర్స్ కోరుతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో సినిమాలు మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులను పలకరించాయి. వాటిని 'రీ-రిలీజ్' అనవచ్చు. కానీ, రెండు సినిమాలను కలిపి ఒక చిత్రంగా రూపొందించిన ప్రయత్నాన్ని రీ-రిలీజ్ అనలేమని నిర్మాతలు, దర్శకుడు అంటున్నారు.
'బాహుబలి' మొదటి భాగం 158 నిమిషాల పాటు సాగుతుంది. అంటే రెండు గంటల 38 నిమిషాల సమయం అన్న మాట! ఇక రెండో భాగం 171 నిమిషాల ప్రదర్శనా సమయంతో తెరకెక్కింది. 2 గంటల 51 నిమిషాల వ్యవధి ! రెండు చిత్రాలను కలిపితే 5 గంటల 29 నిమిషాలు అవుతుంది. ఈ రెండు చిత్రాలను కంటిన్యూగా ఓటీటీలో చూసి ఆనందించిన ప్రేక్షకులూ ఉన్నారు. ఇప్పుడు అంత సమయాన్ని కాకుండా కుదించి 'బాహుబలి- ది ఎపిక్' రూపొందించారు. ప్రేక్షకులు ఇప్పటికే చూసిన దానిని కాకుండా, వారికి కొత్త అనుభూతిని కలిగించేలా 'బాహుబలి- ది ఎపిక్'ను రూపొందించినట్టు రాజమౌళి తెలిపారు. అంటే ఈ రెండు చిత్రాలలోనూ లేని సీన్స్ తో 'ది ఎపిక్'ను రూపొందించారన్న మాట. అక్టోబర్ 31వ తేదీన 'బాహుబలి- ది ఎపిక్' మూవీ ఐమాక్స్, 4డీఎక్స్, డి-బాక్స్, ఈపీఐక్యూ, డాల్బీ సినిమా - ఫార్మాట్స్ లో విడుదల కానుంది. కావున, 'బాహుబలి- ది ఎపిక్ 'ను రీ-రిలీజ్ అనలేం. 'బాహుబలి- ది ఎపిక్' కూడా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Also Read: Tollywood: ఈవారం తెలుగు సినిమాలు
Also Read: Wedding Bells: ఏడు అడుగుల దిశగా నివేద పేతురాజ్