Baahubali The Epic: దర్శక ధీరుడి మాస్టర్ ప్లాన్...

ABN , Publish Date - Jul 19 , 2025 | 02:06 PM

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఒక పక్కన మహేశ్ బాబు సినిమాను తెరకెక్కిస్తూనే, మనసులో ఇంకో మాస్టర్ ప్లాన్ ను సిద్థం చేస్తున్నట్టు తెలుస్తోంది... అది ఏమిటంటే...

Baahubali : The epic

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఏం చేసినా... అది సంచలనమే! అయితే ఒక చేతితో చేసే విషయం మరో చేతికి తెలియకుండా జాగ్రత్త పడటం రాజమౌళికి అలవాటు. ఏ సమయంలో ఏది చెప్పాలో ఆ సమయంలో చెప్పడం ఆయన ప్రత్యేకత. సినిమాలకు సంబంధించిన ప్రకటనల విషయంలో అదీ మరీ ఎక్కువ. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫారిన్ షెడ్యూల్ కూడా త్వరలో టాంజానియాలో మొదలు కానుంది.


అలానే ఈ మధ్య 'బాహుబలి' సినిమా తొలి భాగం విడుదలై పదేళ్ళు అయిన సందర్భంగా మెయిన్ యూనిట్ మెంబర్స్ రీ-యూనియన్ పార్టీ జరుపుకున్నారు. హీరోయిన్స్ అనుష్క, తమన్నా తప్ప మిగిలిన వారంతా ఇందులో పాల్గొన్నారు. ఇదే సమయంలో 'బాహుబలి' రెండు భాగాలనూ కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ఒక సినిమాగా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మూడున్నర గంటల నిడివితో ఈ సినిమాను ప్రభాస్ బర్త్ డే కానుకగా జనం ముందుకు రానుంది. విశేషం ఏమంటే... రెండు భాగాలలో ఉపయోగించకుండా పక్కన పెట్టిన కొన్ని సీన్స్ ను 'బహుబలి ది ఎపిక్'లో వాడబోతున్నారట. రెండు భాగాలను ఒకటి చేసే క్రమంలో కొన్ని సన్నివేశాలను తొలగించడంతో పాటు అదనంగా మరికొన్ని సీన్స్ ను యాడ్ చేస్తారన్న మాట.

ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'బాహుబలి' తృతీయ భాగాన్ని నిర్మించడానికి మేకర్స్ ప్రణాళిక సిద్థం చేస్తున్నారట. ఇప్పటికే రాజమౌళి తండ్రి, 'బాహుబలి'కి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ దీనికి మూడో భాగం ఉండే ఆస్కారం ఉందని చెప్పారు. రాజమౌళి సైతం 'బాహబలి -2'కు కొనసాగింపు ఉంటే బాగానే ఉంటుందనే అభిప్రాయాన్ని గతంలో వెల్లడించారు. కాబట్టి వీరందరి మనసులో 'బాహుబలి 3'కి స్థానం ఉన్న దృష్ట్యా అది కార్యరూపం దాల్చుతుందని, దాన్ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రకటిస్తారని అంటున్నారు. మరి రాజమౌళి మనసులో నిజానికి ఏముంది? ఏ సమయంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది? అనేది వేచి చూడాలి.

Also Read: Nivin Pauly - Abrid Shine: నమ్మకద్రోహం చేశారంటూ నివిన్‌, అబ్రిడ్‌ షైన్‌పై కేసు

Also Read: Vijay Devarakonda: కింగ్ డమ్ హీరో కితాబు...

Updated Date - Jul 19 , 2025 | 02:06 PM