Murugadoss: కొత్త వివాదానికి తెర తీసిన 'మదరాసి'
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:30 PM
'మదరాసి' సినిమా విడుదల సందర్బంగా దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ కొత్త వివాదానికి తెర తీశారు. 'మదరాసి' అనే పేరు వెనుక దక్షిణాది రాష్ట్రాల మ్యాప్ ను పెట్టడాన్ని కొందరు ఆక్షేపిస్తున్నారు. తమని 'మదరాసి'గా ఇంకా గుర్తించాలని తాము అనుకోవడం లేదని చెబుతున్నారు.
కొన్నేళ్ళ పాటు తెలుగు వారిని మదరాసీలుగానే ఉత్తరాది వాళ్ళు గుర్తించే వాళ్ళు. మహానటుడు, నాయకుడు ఎన్టీఆర్ (NTR) పుణ్యమా అని తెలుగుజాతికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం ఎన్టీఆర్ ను ఏకంగా అధికార పీఠంపై కూర్చోపెట్టింది. దక్షిణాది వారిని గంపగుత్తగా 'మదరాసి' (Madarasi) అనేయడం సరైనది కాదని ఎన్టీఆర్ వంటివారు అనేక సార్లు చెప్పారు. ఇప్పుడా ఆ పదాన్ని తిరిగి దక్షిణాది వారందరికీ కట్టబెట్టే ప్రయత్నాన్ని తమిళ దర్శకుడు ఎ. ఆర్. మురుగదాస్ (A.R. Murugadoss) చేయడాన్ని కొందరు తెలుగువాళ్ళు ఆక్షేపిస్తున్నారు.
చిరంజీవి (Chiranjeevi), రజనీకాంత్ (Rajinikanth), మహేశ్ బాబు (Maheshbabu), ఆమీర్ ఖాన్ (Aamirkhan), సల్మాన్ ఖాన్ (Salmankhan) మొదలు కొని ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఎ. ఆర్. మురుగదాస్ తాజా చిత్రం 'మదరాసి' సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. దాని చివరిలో 'మదరాసి' అనే టైటిల్ వెనుక సౌతిండియా పటాన్ని వేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. మదరాసి అనే పేరును తమిళనాడుతో సంబంధం లేని ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలపై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
వచ్చే యేడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి విషయం రాజకీయ రంగు పులుముకుంటోంది. అలానే కొంత కాలంగా తమిళ సినిమాలలో ఉత్తరాది వారిని హేళన చేస్తూ కొన్ని సన్నివేశాలను, సంభాషణలను ఉద్దేశ్యపూర్వకంగా పెడుతున్నారు. హిందీ భాషను, దాన్ని మాట్లాడేవారిని కూడా కించపరిచే సన్నివేశాలను కొన్ని తమిళ చిత్రాలలో చూస్తున్నాం. భారతదేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అంటూ రెండుగా విడదీస్తూ, ప్రజల మధ్య దూరం పెంచే ప్రయత్నం కూడా చాపకింద నీరులా జరుగుతోందని కొందరు అంటున్నారు. తమ ప్రాంతానికో, భాషకో, సంస్కృతికో అన్యాయం జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం, కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని ఎవరూ వ్యతిరేకించరని చెబుతూ, 'ఉద్దేశ్యపూర్వకంగా ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించడాన్ని మాత్రం సహించలేమ'ని అంటున్నారు. గత కొంతకాలంగా తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలలో పెద్దన్న పాత్ర వహించడానికి తహతహలాడుతోందని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే మురుగదాస్ తీసిన 'మదరాసి' సినిమాలోనూ దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటే గాటన కట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. అందరూ కలిసి ఉండాలన్నది మంచి ఆలోచనే అయినా... 'మదరాసి' అనే పదం కింద దక్షిణాది రాష్ట్రాలను చూపించడం సరికాదంటున్నారు.
ఇటీవలే కన్నడ, తమిళనాడు ప్రజల మధ్య భాషాపరమైన వివాదం చెలరేగింది. దీనికి కారణమైన కమల్ హాసన్ 'తగ్గేదేలే' అనడంతో అది చినికి చినికి గాలివానగా మారింది. శివ రాజ్ కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టులు సైతం కల్పించుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతున్న సమయంలో ఇప్పుడు 'మదరాసి' సినిమా టైటిల్ వెనుక వేసి మ్యాప్ తో తిరిగి కొత్త వివాదానికి తెర తీసినట్లు అయ్యింది. గత కొన్నేళ్ళుగా సరైన హిట్ లేక బాధపడుతున్న మురుగదాస్ ఇటీవల ఉత్తరాది హీరోల మీద చేసిన వ్యాఖ్యలు సైతం వివాదానికి దారి తీశాయి. ఓవర్ ఆల్ గా ఏదో ఒక వివాదాన్ని సృష్టించి, 'మదరాసి' సినిమాకు ఆయన హైప్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడేమోనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Coolie: ‘కూలీ’కి.. మద్రాస్ హైకోర్టు షాక్! పిటిషన్ కొట్టివేత
Also Read: 4.5 Gang OTT: ఓటీటీకి తెలుగులో.. మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ సిరీస్