Coolie: ‘కూలీ’కి.. మద్రాస్‌ హైకోర్టు షాక్‌! పిటిషన్ కొట్టివేత‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:22 AM

‘కూలీ’ (Coolie)చిత్రానికి స‌ర్టిఫికేట్ విష‌యంలో నిర్మాతకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

Coolie

నటుడు రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie)చిత్రానికి స‌ర్టిఫికేట్ విష‌యంలో నిర్మాతకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ సినిమాకు యూ-ఏ సర్టిఫికెట్‌ పంపిణీ చేయలేమని మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) ఉత్తర్వులు జారీ చేసింది. లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వంలో రూపొంది ఆగ‌స్టు 14న‌ విడుదలైన కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ పంపిణీ చేయడం వల్ల ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో పిల్లలను అనుమతించడం లేదు.

అందువల్ల ఈ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్‌ పంపిణీ చేయాల్సిందిగా సెన్సార్‌ బోర్డుకు (CBFC) ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్‌టీవీ నెట్‌వర్క్స్ (Sun Pictures) మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు జస్టిస్‌ తమిళ్‌ సెల్వీ ముందు ఇటీవల విచారణకు వచ్చిన సమయంలో సెన్సార్‌ బోర్డు తరుఫున దాఖలు చేసిన నివేదికలో ఆ చిత్రంలో అధికంగా ఫైటింగ్‌ సన్నివేశాలు, మద్యం, ధూమపానం సేవించే సన్నివేశాలతో పాటు అసభ్యకరమైన సంభాషణలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, కూలీ చిత్రాన్ని వీక్షించిన రెండు ప్రత్యేక బృందాలు ఈ చిత్రాన్ని చూసేందుకు చిన్నారులకు అర్హులు కారని నిర్థారించారు. అందువల్ల ‘ఏ’ సర్టిఫికెట్‌ పంపిణీ చేయాలని సిఫారసు చేశారు.

ఇరు తరుఫు వాదనలు విన్న అనంతరం ఈ కేసు తీర్పును తేదీ ప్రకటించకుండా న్యాయమూర్తి వాయిదా వేశారు. గురువారం మళ్లీ విచారణకు వచ్చిన ఈ కేసులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కూలీ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్‌ పంపిణీ చేయలేమని ఆదేశించిన న్యాయస్థానం సన్ టీవీ నెట్‌వర్క్స్ (Sun Pictures) పిటిషన్‌ను తోసి పుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Aug 29 , 2025 | 11:22 AM