కోపంతో గొడ్డలిని నేలపైకి విసిరేశా: గిరిబాబు (పార్ట్ 1)
ABN , First Publish Date - 2021-04-20T02:41:10+05:30 IST
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. నా నలభై ఏళ్ల సినీ జీవితంలో ఎంతోమంది మహానుభావులతో పనిచేసే అవకాశం నాకు కలిగింది అన్నారు ప్రముఖ నటుడు

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. నా నలభై ఏళ్ల సినీ జీవితంలో ఎంతోమంది మహానుభావులతో పనిచేసే అవకాశం నాకు కలిగింది అన్నారు ప్రముఖ నటుడు గిరిబాబు. ఆయన తన సినీ కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. పై విధంగా చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వారంతా నన్ను ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దారు. పరిశ్రమలో ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో అన్నీ నాకు నేర్పించారు. ఆ సలహాలు పాటిస్తూ, వారు నేర్పించిన విషయాలను అమలుపరుస్తూ విజయపథంలో పయనించాను. నాకు మార్గదర్శకులుగా నిలిచిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడం నటుడిగా నా ధర్మం.
వాళ్లందరిలో నేను మొట్టమొదటగా చెప్పాల్సింది ఎస్.డి.లాల్‌గారి గురించి. నాకు గురువు, గాడ్‌ఫాదర్ అన్నీ ఆయనే. నేను తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చానంటే కారణం ఆ మహానుభావుడే. నేను హీరోగా ఆయన ప్రారంభించిన ‘స్వర్గానికి నిచ్చెనలు’ చిత్రం ఆరు రీళ్లు మాత్రమే తయారై, ఆ తర్వాత ఆర్ఠిక కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సినిమాలో నాతో సహా అందరూ కొత్తవారే. కొన్ని రోజుల పాటే షూటింగ్ జరిగినా లాల్‌గారి దృష్టిలో పడి, ఆయన అభిమానానికి పాత్రుడనయ్యాను. సొంతకొడుకులా నన్ను చూసుకొనేవారు. ఈ చిత్రంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పి తీరాలి. లాల్‌గారికి నేనంటే ఎంత అభిమానం ఉందో వెల్లడించే సంఘటన అది.
ఒక రోజు ఏవీఎం స్టూడియోలోని ఫస్ట్‌ఫ్లోర్‌లో షూటింగ్ జరుగుతోంది. నేను, శ్యామలరావు అనే ఆర్టిస్ట్ సెట్‌లో ఉన్నాం. (‘స్వర్గానికి నిచ్చెనలు’ చిత్రం ఆగిపోవడంతో శ్యామలరావు అవకాశాల కోసం ప్రయత్నించి వీలుకాక మద్రాసు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. ప్రస్తుతం ఆయన మనమధ్య లేరు) నేను డైలాగ్ చెప్పడం పూర్తి కాగానే శ్యామలరావు డైలాగ్ చెప్పాలి. అయితే కొత్త కావడంతో సరిగ్గా డైలాగులు చెప్పలేక టేకుల మీద టేకులు తింటున్నాడాయన. నాకు నాటకానుభవం ఉండటంతో తడుముకోకుండా డైలాగులు చెబుతున్నాను.
శ్యామలరావు ఎక్కువ టేకులు తినడంతో లాల్‌గారికి కోపం వచ్చేసినట్లుంది. అయితే అతన్ని అనడానికి మొహమాట పడ్డారో ఏమో కానీ నా వైపు తిరిగి ‘గిరిబాబూ.. ఏమిటిది? నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇది స్టేజీ కాదు..’ అన్నారు కాస్త కఠినంగా. నేను తెల్లబోయాను. నాకు తెలిసి నేను కరెక్ట్‌గానే చేస్తున్నాను. అయినా క్లారిఫై చేసుకోవడానికి... ఆ సినిమాకి భాస్కరరావుగారనీ కెమెరామెన్. ఆయన వంక చూశాను. ‘నీ తప్పేమీ లేదు’ అన్నట్లుగా ఆయన సైగ చేశాడు. మరి లాల్‌గారు ఎందుకలా అన్నారు?
శ్యామలరావు డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడుతుంటే అతన్ని కేకలేయడం మానేసి అందరి ముందు నన్ను తిడతాడా? నా తప్పు ఉంటే ఎలాంటి తిట్లు తినడానికైనా సిద్ధమే. కానీ ఏ తప్పూ లేకుండా లాల్‌గారు అలా కఠినంగా మాట్లాడేసరికి ఆవేశం, కోపం రెండూ వచ్చేసి నా భుజాన ఉన్న గొడ్డలిని నేలపైకి విసిరేశా. సెట్లో ఎవరూ ఊహించని సంఘటన ఇది. అందుకే అందరూ నా వంకే ఆశ్చర్యంగా చూస్తున్నారు. లాల్‌గారు కూడా షాకయ్యారు. అయినా నేను లక్ష్యపెట్టలేదు. ఇక ఒక క్షణం అక్కడ ఉండలేక ఫ్లోర్‌లోంచి బయటకు నడిచాను.
అప్పుడు రాత్రి ఒంటిగంట అవు తోంది. ఆ సీన్‌ని ఎలాగైనా పూర్తి చేయాలని లాల్‌గారు షూటింగ్‌కు ప్యాకప్ చెప్పకుండా వర్క్ చేస్తున్నారు. మేం కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాం. మధ్యలో ఈ సంఘటన జరగడంతో అంతా డిస్ట్రర్బ్ అయ్యింది. ఫ్లోర్‌కి కొంచెం దూరంలో ప్రొడక్షన్ మేనేజర్ ఉంటే అతని దగ్గరికి వెళ్లి ‘సార్.. నాకు కారు ఇస్తారా.. రూమ్‌కి వెళ్లాలి’ అనడిగాను. ‘అదేమిటి సార్.. ప్యాకప్పా?’ అని ప్రశ్నించాడతను. ‘ప్యాకప్ కాదు.. నాకు అయిపోయింది. నేను వెళుతున్నాను. కారు ఇస్తారా’ అన్నాను. ‘అయితే ఒక్క నిముషం సార్.. డైరెక్టర్‌గారిని అడిగి వస్తాను’ అని లోపలికి వెళ్లాడు. లాల్‌గారికి ఏం చెప్పాడో ఏమో కానీ మళ్లీ నా దగ్గరకి వచ్చి ‘డైరెక్టర్‌గారు మిమ్మల్ని వెళ్లొద్దని చెప్పమన్నారు సార్..’ అన్నాడు. మనసంతా చిరాకుగా ఉండటంతో అతని మాటలు పట్టించుకోకుండా స్టూడియో నుంచి బయటకు వచ్చేసి, రిక్షా ఎక్కి నా రూమ్‌కి చేరుకున్నాను.
కోడంబాకం బ్రిడ్జి ఇవతల లిబర్టీ టాకీస్ అనే థియేటర్ ఉండేది. దాని దగ్గర్లోనే ఉన్న ఉమా లాడ్జీలో ఉండేవాడిని. నేను, ఎం.పి. ప్రసాద్ రూమ్మేట్స్. ‘స్వర్గానికి నిచ్చెనలు’ చిత్రంలో అతను కూడా ఒక పాత్ర చేస్తున్నాడు.(‘తాతమ్మ కల’ సినిమాలో నేను చేయలేకపోయిన వేషాన్ని ఆ తర్వాత అతను చేశాడు) వాడికి ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో రూమ్‌లోనే ఉన్నాడు. నన్ను చూడగానే ‘ఏరా.. షూటింగ్ అయి పోయిందా?’ అనడిగాడు. ‘అయిపోయిందిరా’ అని ముక్తసరిగా సమాధానం చెప్పి పడుకున్నాను. పొద్దున్నుంచీ బాగా అలసి ఉన్నానేమో వెంటనే నిద్ర పట్టేసింది.!
(ఇంకా ఉంది)
- వినాయకరావు
