Mahavatar Narasimha: ట్రెండ్ సెట్టర్ గా 'నరసింహ'

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:31 PM

యానిమేటెడ్ మూవీస్ అనగానే హాలీవుడ్ సినిమాలనే తలచుకుంటారు. లేదా అడపాదడపా వచ్చే జపాన్ యానిమేషన్స్ నూ గుర్తు చేసుకుంటారు. 'మహావతార్- నరసింహ' ఘనవిజయంతో ఇండియన్స్ సైతం యానిమేషన్ ఫిలిమ్స్ తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్నారు. 'నరసింహ' సక్సెస్ సాగాను గుర్తు చేసుకుందాం...

Mahavatar Narasimha movie

దక్షిణాదికి చెందిన 'హోంబలే ఫిలిమ్స్' (Hombale films) సంస్థ నిర్మించిన యానిమేటెడ్ మైథలాజికల్ మూవీ 'మహావతార్ - నరసింహ' (Mahavatar Narasimha). గత వారం విడుదలైన ఈ మూవీ కేవలం ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం 30 కోట్లకు పైగా పోగేసినట్టు సమాచారం. భారతదేశంలో రూపొందిన యానిమేటెడ్ మూవీస్ పెద్దగా అలరించలేదు. గతంలో వచ్చిన 'హనుమాన్' (Hanuman) విశేషాదరణ చూరగొంది. ఆ తరువాత ఈ 'మహావతార్ - నరసింహ'నే విజయఢంకా మోగిస్తోంది అని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మెల్లగా మన ఇండియన్ యానిమేషన్ ఫిలిమ్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించే అవకాశం లభించిందని పరిశీలకుల అభిప్రాయం.


ఇప్పటి దాకా హాలీవుడ్ రూపొందించిన యానిమేటెడ్ మూవీస్ లేదా జపాన్ తెరకెక్కించిన యానిమేషన్స్ మాత్రమే విశేషంగా అలరించాయి. వారి స్థాయిలో యానిమేషన్స్ ఎవరూ చేయలేరన్న అభిప్రాయం కూడా కొందరికి ఉండేది. కానీ, భారతీయ పురాణగాథలను తెరకెక్కిస్తే ఆదరణ లభిస్తుందని భావించిన 'హోంబలే ఫిలిమ్స్' వారి యోచనను అందరూ అభినందిస్తున్నారు. గతంలో ఆదరణ పొందిన 'హనుమాన్' కూడా రామాయణం ఆధారంగా తెరకెక్కిందే. మన పురాణాల్లోని గాథల్లో ప్రపంచాన్నంతటిని ఆకర్షించే అంశాలున్నాయని కొందరు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే 'మహావతార్- నరసింహ' రూపొందింది.

ఈ యేడాది అత్యధిక వసూళ్ళు చూసిన ఇంగ్లిష్ సినిమాలు ఏవంటే - 'ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ', 'లిలో అండ్ స్టిచ్' అనే చెప్పాలి. చైనా నుండి విడుదలయిన 'నె ఝా 2' కూడా మంచి విజయం సాధించింది. ఇక జపాన్ లో అత్యధిక వసూళ్ళు చూసిన సినిమాల్లో పది యానిమేటెడ్ మూవీస్ ఉండడం గమనార్హం. ఇలా యానిమేషన్ ఫిలిమ్స్ కు ఆ యా దేశాల్లో ఎంతో ఆదరణ ఉంది. మన దేశంలోనూ మెల్లగా యానిమేటెడ్ మూవీస్ కు క్రేజ్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకు 'మహావతార్ - నరసింహ' గ్రాండ్ సక్సెస్ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.


'హోంబలే' నిర్మాణ సంస్థ భారతీయ పురాణాలను ఆధారం చేసుకొని ఓ పది యానిమేటెడ్ మూవీస్ ను రూపొందించాలని ప్లాన్ చేసింది. అందులో మొదటగా 'మహావతార్ - నరసింహ' రిలీజయింది. తరువాతి రోజుల్లో విష్ణువు దశావతారాల్లోని మరిన్ని కథలతో 'హోంబలే' నుండి యానిమేటెడ్ మూవీస్ రానున్నాయి. పదేళ్ళ పాటు ఈ మూవీస్ ను వరుసగా విడుదలచేస్తామని గతంలోనే హోంబలే సంస్థ ప్రకటించింది. ఆరంభంలోనే 'మహావతార్ - నరసింహ'తో బంపర్ హిట్ పట్టేసిన ఈ సంస్థ రాబోయే చిత్రాలతో ఏ తీరున మురిపిస్తుందో అని సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల ప్రభావం వల్ల మన దేశంలో యానిమేషన్ ఫిలిమ్స్ కు ఎలాంటి క్రేజ్ ఏర్పడనుందో చూడాలి.

Also Read: Oh Bhama Ayyo Rama OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి సుహాస్ లేటెస్ట్‌ మ‌ద‌ర్ సెంటిమెంట్ మూవీ

Also Read: Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ

Updated Date - Jul 31 , 2025 | 04:43 PM