National Awards: విజేతలకు పవన్ అభినందనలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 09:49 PM

జాతీయ సినీ అవార్డులకు ఎంపికైన తెలుగు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎ.పి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Pawan Kalyan

జాతీయ చలన చిత్ర పురస్కార గ్రహీతలకు ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, '71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి (Anil Ravipudi), నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ (Hanu-man)చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్. నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా శ్రీ నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి. జాతీయ ఉత్తమ నటులుగా శ్రీ షారుక్ ఖాన్, శ్రీ విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా శ్రీ సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు' అని తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 09:50 PM