Coolie Review: రజనీకాంత్ 'కూలీ' మెప్పించిందా
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:50 PM
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కూలీ. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సినిమా రివ్యూ: 'కూలీ' (Coolie Review)
విడుదల తేది: 14-8-2025
తలైవా రజనీకాంత్‌కు (Rajinikanth)సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో పనిలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చిత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. 'జైలర్' సినిమా తర్వాత నటించిన ‘వేట్టయాన్’, 'లాల్ సలామ్’ చిత్రాలు ఆశించిన ఫలితం అందుకోలేదు. తదుపరి లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanakaraj) తెరకెక్కించిన 'కూలీ' చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా టైటిల్ నుంచి రజనీలుక్, సింపుల్ ట్రైలర్‌లో సినిమాపై హైప్ పెంచారు లోకేశ్ కనగరాజ్. పైగా ఇందులో విలన్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున, కీలక పాత్రల్లో బాలీవుడ్ నుంచి ఆమిర్‌ఖాన్(Aamir Khan), కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) కనిపించడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రజనీ కూలీగా ఎలా అలరించారన్నది చూద్దాం.
కథ: (Coolie Story)
దేవరాజ్ అలియాస్ దేవ (Rajinikanth) పోర్ట్‌లో కూలీ. అతని నంబర్ 5821. తనని నమ్ముకుని ఉన్న కూలీ గ్యాంగ్‌తో అజ్ఞాతంలో ఉంటాడు. తన చిరకాల మిత్రుడు, చెల్లిని ఇచ్చిన బావమరిది రాజశేఖర్ (సత్యరాజ్)ను చంపిన వాడిపై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. సైమన్ (నాగార్జున).. ఆర్గాన్స్ ఎక్స్‌పోర్ట్ వంటి అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. అతని కింద దయాళ్ (సౌబిన్ షాహిర్) పని చేస్తుంటాడు. పోర్ట్‌లో జరిగేవి బయటకు వెళ్ళకుండా చూసుకోవడం, వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని అడ్రస్ లేకుండా చేయడం దయాల్ పని. రాజశేఖర్ కనిపెట్టిన క్రిమేషన్ ఛైర్, దాంతో సైమన్‌కు ఉన్న సంబంధం ఏంటి? అతను సైమన్ అధీనంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది. దేవాకు, సైమన్‌కు, సంబంధం ఏంటి? మెక్సికోలో ఉండే దాహా (ఆమిర్‌ఖాన్)కు వీరికి ఉన్న కనెక్షన్ ఏంటి? కాళేశ్(ఉపేంద్ర), కళ్యాణి దయాల్, ప్రీతికి పాత్రలేంటి? చివరకు దేవా తన పగ తీర్చుకున్నాడా? లేదా అన్నది కథ.
విశ్లేషణ: (Coolie Review)
లోకేశ్ కనకరాజ్ కథలన్నీ మాఫియా, డ్రగ్, అక్రమ రవాణా ఈ తరహాలోనే ఉంటాయి. ‘కూలీ’ కూడా ఆ తరహా కథే. ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా కథ ఇదీ అని రివీల్ చేయలేదు. ట్రైలర్ కట్ కూడా సాధారణంగా వదిలాడు. దాంతో ఇంకేదో సినిమాలో ఉందని సినీ ప్రియులు అంచనాలు పెంచుకున్నారు. లగ్జరీ వాచ్‌ల దందా అనేది ఇందులో చూపించాడు. అది కాస్త ఫ్రెష్‌గానే అనిపించింది. అయితే లోకేశ్ తీసింది కొత్త కథేమీ కాదు.. రెగ్యులర్ రివేంజ్ డ్రామానే తీశాడు. తెలిసిన కథకే బలమైన పాత్రలు జోడించి ఈ సినిమా తెరకెక్కించారు దీనికి ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహాన్ని జోడించాడు. రాజశేఖర్ కనిపెట్టిన క్రిమేషన్ మెషీన్ దగ్గర మొదలైన కథ.. అక్కడి నుంచి అక్రమ రవాణ చేసే ఓ వ్యాపారి, అతని నుంచి విదేశాల్లో ఉండే డాన్ వరకూ సాగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంది. దయాల్ పట్టుబడినప్పటి నుంచి ఫ్లాష్‌బ్యాక్ ఏంటనేది రివీల్ చేశాడు. స్నేహితుడిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే దిశగా వెళ్తున్న హీరోకు సైమన్ గతం తెలియడం కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. కథలో బలమైన ఎమోషన్, కాన్‌ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడు కథలో ఇన్‌వాల్వ్ అయేంతగా ట్రీట్‌మెంట్ ఇవ్వలేదు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఏం జరిగిందనేది చెప్పడంలో దర్శకుడు సఫలమైనా లైవ్‌లోకి వచ్చే సరికి ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ట్రైన్, పోర్ట్‌లో ఫైట్స్ ఆకట్టుకుంటాయి. దేవ గతం గురించి మాత్రం సింపుల్‌గా ఆరు లైన్ల మాటల్లో తేల్చేయడం అంతగా ఆకట్టుకోదు. స్క్రీన్‌ప్లే ఇంకా ఆసక్తిగా మలిచే అవకాశం ఉన్నా తన రెగ్యులర్ స్టైల్‌లోనే సినిమా ముగించాడు దర్శకుడు.
నటీనటుల పని తీరు... దేవాగా రజనీకాంత్ తనదైన స్టైల్లో చేసుకెళ్లిపోయారు. డాన్స్‌లు, ఫైట్‌ల విషయంలో పెద్దగా కష్టపెట్టకుండా వయసుకు తగ్గట్టుగా అన్ని సెట్ చేశారు. యాక్షన్, ఎమోషన్స్‌తో మెప్పించారు. సీన్‌కు తగ్గట్టు మౌల్డ్ అయ్యారు. ఆయన కరిజ్మా సినిమాకు ప్లస్ అని చెప్పాలి. నాగార్జున విలన్‌గా మెప్పించారు. లుక్ బావుంది. కానీ ఆయన చెప్పినంతగా సైమన్ పాత్రలో కొత్తేమీ లేదు. బలమైన విలన్ అని ప్రొజెక్ట్ చేసిన అతన్ని అంతం చేసిన తీరు పేలవంగా ఉంటుంది. సైమన్ కన్నా దయాల్ పాత్రే పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. సత్య రాజ్ కనిపించింది కాసేపే అయినా అయన పాత్ర సినిమాకు కీలకం. సౌబిన్ షాహిర్ పాత్ర కూడా సినిమాకు ఎసెట్. క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ పాత్రలు కూడా సినిమాకు కరెక్ట్‌గా కుదిరాయి. ప్రీతి పాత్రలో శ్రుతి హాసన్ మెప్పించారు. పండించిన ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. మోనికా రెబా జాన్, బ్లెస్సీ, రచితా రామ్ ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. 'మౌనికా' అంటూ పూజాహెగ్డే ప్రత్యేక గీతంలో మెరిసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. విజువల్‌గా సినిమా బావుంది. ద్వితీయార్ధానికి కాస్త కత్తెర వేయవచ్చు. కళానిధి మారన్ నిర్మాణ విలువలు బావున్నాయి. లోకేష్ గత చిత్రం లియోతో పోలిస్తే.. కూలీ స్టోరీ.. మేకింగ్ విషయంలో దర్శకుడు కాస్త శ్రద్ద పెట్టాడనిపిస్తోంది. ఎంతమంది స్టార్స్ తో తీసినా దర్శకుడు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు.
ట్యాగ్‌లైన్: ఊరించి ఉసూరుమనిపించిన 'కూలీ'
రేటింగ్: 2.5/5