Rahul Sipligunj: రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:12 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కలిశాడు. బోనాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బహుమతికి రాహుల్ థ్యాంక్స్ చెప్పాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కలిశాడు. బోనాల పండుగ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదు బహుమతికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సత్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని... దానికి తగినట్టుగా మరింత కృషి చేస్తానంటూ చెప్పుకొచ్చాడు రాహుల్.
ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో 'నాటు నాటు' ( Naatu Naatu ) పాట ఆస్కార్ అవార్డు సాధించింది. అంతేకాక ఈ పాట పాడిన రాహుల్ పై ప్రశంసల వర్షం కురిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, రాహుల్‌కి 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ₹1 కోటి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో రాహుల్‌ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి.. తనకు తగిన బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఇదే క్రమంలో బోనాల సందర్భంగా ₹1 కోటి నగదు బహుమతిని ప్రకటించి, తను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.