‘కల్ట్’ ట్రైలర్ రివ్యూ: నెత్తురోడే యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్
ABN, Publish Date - Oct 18 , 2026 | 07:15 PM
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి సారి పూర్తిస్థాయి ‘స్లాషర్’ జానర్లో విశ్వక్ సేన్ దర్శకత్వంలో, ఆయనే హీరోగా రూపొందించిన భారీ ప్రాజెక్ట్ ‘కల్ట్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) అంటేనే సరికొత్త ప్రయోగాలు, అన్కాంప్రమైజ్డ్ టేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్! ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి సారి పూర్తిస్థాయి ‘స్లాషర్’ జానర్లో స్వీయ దర్శకత్వంలో హీరోగా రూపొందించిన భారీ ప్రాజెక్ట్ ‘కల్ట్’ (#CULT). తారక్ సినిమాస్ పతాకంపై నిర్మాత సందీప్ కాకరాల అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కల్ట్’.. తాజాగా వచ్చిన ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిందని చెప్పుకోవచ్చు.
ఈ ట్రైలర్‌ని గమనిస్తే (Cult Trailer Review).. ట్రైలర్ ఆద్యంతం గుండెజబ్బు ఉన్నవాళ్లు తట్టుకోలేనంత భయంకరమైన సస్పెన్స్, అడ్రినలిన్ రష్ ఇచ్చే యాక్షన్, డార్క్ థీమ్‌తో రక్తసిక్తంగా ఉంది. గోవా నేపథ్యంలో ఓ భారీ ప్యాలెస్‌లో జరిగే పార్టీలోకి వందలాది మంది యువతీ యువకులు వస్తారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత డోర్లు క్లోజ్ అయిపోయి.. ఒక క్రూరమైన మాస్క్ ధరించిన సైకో కిల్లర్ నియమించిన రూల్స్ ఉల్లంఘించినందుకు వారిని వేటాడి చంపే సైకో గేమ్ మొదలవుతుంది. గేట్లు అన్నీ బాంబులతో మూసివేయబడతాయి. బయట ఉన్న పోలీసులకు, లోపల దాదాపు 300 మంది బందీలుగా ఉన్నారనే షాకింగ్ నిజం తెలుస్తుంది. ఈ నరమేధంలో చిక్కుకున్న ప్రజలను కాపాడే ఏకైక ఆశ ‘డిఎస్పీ సంకల్ప్ నాయక్’ (విశ్వక్ సేన్). అతడు మోడీ గారి కన్నా మొండోడు, డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే పేలినట్టుండే రకం అంటూ ఇచ్చే ఎలివేషన్ వేరే లెవల్! ‘నాతో ప్రాబ్లెం లేదురా.. నాకు అప్పుడప్పుడు తిక్కరేగుతుంది’ అంటూ లోకల్ స్లాంగ్‌లో చెప్పే మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి.
ట్రైలర్లో చూపించిన గొడ్డళ్లు, కత్తులు, రక్తపు మరకలు, స్లాషర్ మూమెంట్స్ భారతీయ తెరపై ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త క్రైమ్ హారర్ అనుభూతిని ఇస్తున్నాయి. ‘ఈ భయం, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ తీసుకోవద్దు.. ఇయ్యాలె.. చింపి పడేయాలె!’ అంటూ విశ్వక్ సేన్ పలికిన తీరు ట్రైలర్‌కు పీక్ మూమెంట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. గూస్బంప్స్ తెప్పించే సౌండ్ డిజైన్, బీట్స్ సినిమా హారర్ అండ్ యాక్షన్ మూడ్‌ను పీక్స్‌కి చేర్చాయి. Gen-Z యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్, రైటర్ తరుణ్ భాస్కర్ రాసిన డైలాగులు విశ్వక్ మార్క్ యాటిట్యూడ్‌కి పక్కాగా సరిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ రా స్లాంగ్, ఫోన్‌కాల్ సంభాషణలు థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయం. నటీనటులందరూ వారి పాత్రల్లో ఇమిడిపోయారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ హాలీవుడ్ స్లాషర్ చిత్రాల రేంజ్లో ఉన్నాయి. నిర్మాత సందీప్ కాకరాల రాజీ పడకుండా పెట్టిన భారీ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండియర్‌గా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే ‘కల్ట్’ ట్రైలర్ తెలుగు సినిమా స్థాయిని దాటి హాలీవుడ్ కల్ట్ స్లాషర్ ఫిల్మ్స్‌ను తలపించేలా ఒక నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రామిస్ చేస్తోంది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
ఇవి కూడా చదవండి:
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఆ లిస్ట్‌లోకి చేరిన దర్శకుడు
అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. దర్శకుడెవరంటే?
‘కల్కి 2’ షూటింగ్‌పై అప్డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్