చిరు విల‌న్‌ని.. ప‌ట్టిన బాలకృష్ణ‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:36 PM

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ దర్శకుడు, నటుడు కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది.

nbk

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (koratala shiva) కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం విధితమే. ఈ క్రేజీ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'దేవర' తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా రోజుల పాటు బలమైన కసరత్తు చేశారట. బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్‌కు తోడు, కొరటాల శైలిలో గుండెల్ని హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తూ కథను సిద్ధం చేశారని టాక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుండగా.. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ విలక్షణమైన బాలీవుడ్ స్టార్ దర్శకుడు, నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఆయనే అనురాగ్ కశ్యప్. ఈ చిత్రంలో ఆయన విభిన్నమైన వేరియేషన్స్ ఉన్న నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే కొరటాల శివ ఆయన్ను కలిసి కథ, పాత్ర స్వభావాన్ని వివరించారని సమాచారం. పవర్‌ఫుల్ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).. మాస్ హీరో బాలకృష్ణకు ఎదురుపడితే, ఆ సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అనురాగ్ కశ్యప్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న 'కాకా' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన ఆ సెట్స్‌లో కూడా అడుగుపెట్టారు. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'కాకా'పై భారీ హైప్ నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రాబోతోంది. అలా మెగాస్టార్ సినిమాలో నటిస్తున్న అనురాగ్ కశ్యప్, ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్‌లోకి కూడా వస్తున్నారనే ప్రచారం రావడంతో టాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

అనురాగ్ కశ్యప్ ఎంట్రీపై చిత్ర బృందం నుంచి గానీ, అటు ఆయన నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కూడా ఈ సినిమా కోసం సీనియర్ నటి విజయశాంతి, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, కోలీవుడ్ హీరో ఆర్య, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ పేర్లు గట్టిగా వినిపించాయి. మరి వీరిలో ఎవరు నిజంగా నటిస్తున్నారు, ఎవరు కేవలం రూమర్లకే పరిమితం అవుతారు అనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనా లీకుల రూపంలో వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Oct 18 , 2026 | 06:09 PM