'రణబాలి' ఎఫెక్ట్.. ప్రభాస్ 'ఫౌజీ'కి అసలైన పరీక్ష

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:28 PM

రణబాలి మిశ్రమ స్పందన నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీపై ఆసక్తి పెరిగింది.

Fauzi, ranabaali

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా వచ్చిన పీరియడ్ డ్రామా ‘రణబాలి’ (ranabaali) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో నడుస్తోంది. భారీ సెట్టింగులు, బ్రిటిష్ పాలన నాటి వాతావరణం ఉన్నప్పటికీ, ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపింది. భారత స్వాతంత్య్ర‌ పోరాటం, బ్రిటీష్ రూల్ నేపథ్యంగా వచ్చే సినిమాలను టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ అంత సులువుగా స్వాగతించదా..? ఇలాంటి సమయంలోనే గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’పై ఒక్కసారిగా ఇండస్ట్రీ ఫోకస్ పెరిగింది. అసలు బ్రిటిష్ కాలం నాటి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎదురయ్యే సవాళ్లేంటి..? ప్రభాస్ ఈ రిస్క్‌ను ఎలా అధిగమించబోతున్నారు..?

తెలుగు సినీ చరిత్రను ఒక్కసారి గమనిస్తే.. బ్రిటీష్ నేపథ్యం ఉన్న కథలతో సినిమాలు తీయడం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. నాటి సూపర్ స్టార్ కృష్ణ నటించిన క్లాసిక్ అల్లూరి సీతారామరాజు నుంచి ఇటీవలి కాలంలో ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ఆర్ఆర్ఆర్ వరకు చరిత్ర సృష్టించాయి. ప్రేక్షకుల గుండెల్ని హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన లార్జర్-ద్యాన్-లైఫ్ ఎలివేషన్లు తోడైతే జనం బ్రహ్మరథం పడతారని ఆ చిత్రాలు నిరూపించాయి.

అయితే అదే సమయంలో వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న వరుణ్ తేజ్ కంచె లాంటి చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. కేవలం దేశభక్తి, వీరుల త్యాగాలు చూపించినంత మాత్రాన సరిపోదని, ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే బిగువైన స్క్రీన్‌ప్లే, ఊహకందని ట్విస్టులు, గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉన్నప్పుడే ఇలాంటి పీరియడ్ జానర్ చిత్రాలు సేఫ్ జోన్‌లోకి వెళ్తాయని గత అనుభవాలు చెబుతున్నాయి.

అయితే ఇదే సమయంలో ఇప్పుడు అందరి కళ్లూ ఫౌజీ మీదే ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని 1940ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో, రెండో ప్రపంచ యుద్ధం అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారనే సమాచారం ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.

భారత చరిత్రలో ఎక్కువ మందికి అంతగా పరిచయం లేని ఒక విశిష్టమైన అంశాన్ని ఎంచుకోవడం వరకు మంచి ప్రయత్నమే. పైగా ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఉన్న స్టార్ తోడయ్యారు. కానీ, చరిత్రను కేవలం డాక్యుమెంటరీలా కాకుండా, ప్రతి సీన్‌లోనూ హై-వోల్టేజ్ డ్రామా ఉండేలా మలచడం ఇక్కడ అతిపెద్ద టాస్క్. దర్శకుడు హను రాఘవపూడి సినిమాల్లో క్లాసిక్ టచ్, అద్భుతమైన విజువల్స్, ఆహ్లాదకరమైన సంగీతం పుష్కలంగా ఉంటాయి.

అయితే, చాలా సినిమాల్లో సెకండాఫ్‌లో వేగం తగ్గడం, కథనం కాస్త నెమ్మదించడం లాంటి అంశాలపై గతంలో విమర్శలు వచ్చాయి. ‘ఫౌజీ’ లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాకు ఆ తరహా నెమ్మది ఏమాత్రం వర్కవుట్ కాదు. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేసే సంఘర్షణలు, బలమైన ఎమోషన్స్, స్క్రీన్ మీద కనిపించే కొత్తదనం మాత్రమే ఈ సినిమాను నిలబెట్టగలవు.

ప్రభాస్ మార్కెట్ పరిధిని దృష్టిలో పెట్టుకుని, అటు మాస్ ఆడియన్స్‌కు నచ్చే యాక్షన్, ఇటు పీరియడ్ స్టోరీకి కావాల్సిన నేటివిటీని సమపాళ్లలో మిక్స్ చేయాల్సి ఉంటుంది. రణబాలి అందించిన మిశ్రమ ఫలితం తర్వాత, టాలీవుడ్‌లో బ్రిటిష్ కాలం నాటి కథల భవిష్యత్తును నిర్ణయించడంలో ఫౌజీ పాత్ర చాలా కీలకం కానుంది. హను రాఘవపూడి తన విజన్‌తో ప్రభాస్ స్టార్‌డమ్‌ను సరైన రీతిలో ప్రజెంట్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా? పీరియడ్ చిత్రాల చుట్టూ ఉన్న ఆ సెంటిమెంట్‌ను చెరిపేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Updated Date - Oct 18 , 2026 | 03:39 PM