వెంకీ సెంటిమెంట్‌కు పోటీగా 7 సినిమాలు.. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' సందడి!

ABN , Publish Date - Oct 21 , 2026 | 12:36 PM

విక్టరీ వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30న విడుదల కానుంది. అదే రోజున విశ్వక్ సేన్ 'కల్ట్' సహా మరో ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వెంకీ అక్టోబర్ సెంటిమెంట్ ఈసారి ఫలిస్తుందా?

October 30th Movies

విక్టరీ వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30న వస్తోంది. వెంకీ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. కారణం తమ హీరోకు అక్టోబర్ నెల కలసి వస్తుందనేది అభిమానుల నమ్మకం. అయితే అదే రోజున మరికొన్ని సినిమాలూ విడుదల కానున్నాయి. మరి వెంకీ సెంటిమెంట్ కలసి వస్తుందా.!?

మొత్తానికి అక్టోబర్ లోనే వెంకటేశ్ 'ఆదర్శకుటుంబం' వచ్చేస్తోంది. అదే ఆయన అభిమానులకు అమితానందం పంచుతోంది. మొదట్లో అక్టోబర్ 2న 'ఆదర్శకుటుంబం' వస్తుందని అన్నారు. తరువాత అక్టోబర్ 9 అనీ వినిపించింది. తరువాత ఏలాంటి ఊసూ లేదు. దాంతో అక్టోబర్ లో 'ఆదర్శ కుటుంబం' వస్తుందా రాదా అని ఆందోళన చెందారు అభిమానులు. ఇదిలా ఉంటే దసరా రోజున ఫ్యాన్స్ కు ఆనందం పంచుతూ వెంకటేశ్ స్వయంగా అక్టోబర్ 30న 'ఆదర్శకుటుంబం' వచ్చేస్తోందని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. దాంతో మళ్ళీ ఫ్యాన్స్ లో జోష్‌ పెరిగింది. 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమాల గ్రాండ్ సక్సెస్ తో పాటు రాబోయే 'ఆదర్శ కుటుంబం' కూడా సక్సెస్ సాధిస్తే వెంకీకి చాలా ఏళ్ళ తరువాత 'హ్యాట్రిక్' సొంతమవుతుందని అభిమానుల అభిలాష!. 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్ మెయిన్ హీరో కాకున్నా కీ రోల్ లో కనిపించటం విశేషం.


వెంకటేశ్ కెరీర్ లో ఆయనకు బాగా అచ్చి వచ్చిన మాసాల్లో జనవరి, అక్టోబర్ ఉన్నాయి. అక్టోబర్ లో విడుదలైన వెంకటేశ్ మూవీస్ లో "వారసుడొచ్చాడు, క్షణక్షణం, సుందరకాండ, ముద్దుల ప్రియుడు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, ప్రేమంటే ఇదేరా, జయం మనదేరా, జెమిని, తులసి, చింతకాయల రవి" వంటివి ఉన్నాయి. వీటిలో ఒకే ఒక్క 'ముద్దుల ప్రియుడు'ను మినహాయిస్తే అన్నీ ప్రేక్షకులకు వినోదం పంచినవే. వీటిలో కొన్ని బంపర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఈ కారణంగానే ఫ్యాన్స్ 'ఆదర్శకుటుంబం' అక్టోబర్ 9న కూడా రాకపోవడంతో ఈ నెలలో వస్తుందో రాదో అని కంగారు పడ్డారు. ఎట్టకేలకు వెంకీ ట్వీట్ తో వారికి ఊరట లభించింది. అదే వారిలో మరింత ఆనందాన్ని పెంచింది.


అక్టోబర్ 30న 'ఆదర్శకుటుంబం' వస్తోంది. బాగానే ఉంది. అయితే అదే రోజున మరో ఏడు సినిమాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అవి చిన్న చిత్రాలే అయినా, వాటిలోనూ కాస్త క్రేజ్ ఉన్న మూవీస్ ఉన్నాయి. విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన 'కల్ట్' అక్టోబర్ 30నే రానుంది. అనీశ్ రెడ్డి, అనశ్వర రాజన్ జోడీగా నటించిన 'ఇట్లు అర్జున్' , శ్రీనాథ్ చంద్రశేఖర్ తెరకెక్కించిన 'చంద్రయాన్' కూడా అక్టోబర్ 30న విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలానే రాహుల్ విజయ్‌ హీరోగా నటిస్తున్న 'అ' సినిమా, పిల్లల చిత్రంగా ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన 'సమ్మర్‌ హాలిడేస్‌', హర్షిత్‌ రెడ్డి హీరోగా నటించిన 'రోమియో జూలియట్‌' సైతం అక్టోబర్ 30న జనం ముందుకు వస్తున్నాయి. అలానే జ్యోతి పూర్వజ్‌ 'కిల్లర్' కూడా 30నే రాబోతోంది. 'ఆదర్శ కుటుంబం' నెలాఖరులో విడుదల అవుతుందని ఊహించని వీరంతా ఈ డేట్‌ లాక్‌ చేసుకున్నారు. తీరా చూస్తే. 'ఆదర్శ కుటుంబం'ను 30నే రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. మరో చిత్రం ఏమంటే నిజానికి ఇదే రోజున శ్రీకాంత్‌ తనయుడు రోషన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన 'ఏమో ఏమో ఇది' కూడా రావాల్సి ఉంది. 'ఆదర్శకుటుంబం' రాకతో దీనిని తప్పనిసరిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ఇదే నెల 29న ఇవీవీ సినిమా 'ఆరుగురు ప్రతివ్రతలు' రీ-రిలీజ్‌ కాబోతోంది. ఇన్ని సినిమాల మధ్య వస్తున్న 'ఆదర్శ కుటుంబం' ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మరో స్టార్ హీరోని పట్టిన బుచ్చిబాబు.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి

స్పిరిట్ పోయింది.. ఎల్లమ్మ వచ్చింది

దేవుళ్లనే నమ్ముకున్న ఆది.. మొన్న శంబాల.. నేడు రుద్ర

Updated Date - Oct 21 , 2026 | 12:43 PM

Sai Pallavi: సీతమ్మను చూసినప్పుడు.. ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వం కలగాలి

Sharwanand: సైకిల్‌ను అర్థ రూపాయికి.. అద్దెకు తీసుకుని విజ‌య‌వాడ‌లో తిరిగా

బాలీవుడ్‌ను మళ్లీ వణికిస్తున్న అండర్‌వరల్డ్.. సల్మాన్ ఖాన్ చుట్టూనే అసలు కథ?

‘AK47’ రెండో పాట ‘మాలా’ వచ్చేసింది.. నివేదా పేతురాజ్‌‌ని చూడాల్సిందే

మెగా ఇంట పెళ్లి సందడి.. సుప్రీం హీరో పెళ్లి ఫిక్స్