Sharwanand: సైకిల్‌ను అర్థ రూపాయికి.. అద్దెకు తీసుకుని విజయవాడలో తిరిగా
ABN , Publish Date - Oct 20 , 2026 | 07:19 AM
సింగ్ నగర్లో జరిగిన విజయవాడ ఉత్సవ్‌లో సోమవారం నటుడు శర్వానంద్ సందడి చేశారు. విజయవాడతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు
సింగ్ నగర్లో జరిగిన విజయవాడ ఉత్సవ్‌లో (Vijayawada Utsav 2026 ) సోమవారం నటుడు శర్వానంద్ (Sharwanand) సందడి చేశారు. ఈ సందర్భంగా విజయవాడతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "విజయవాడలోనే పుట్టిపెరిగాను. ఇక్కడికి వస్తే పాత జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు చెబుతారు. దసరా అంటే విజయవాడ చెప్పేస్థాయికి తీసుకొచ్చారు. అంత ఘనంగా విజయవాడ ఉత్స వను నిర్వహిస్తున్నారు. సైకిల్‌ను గంటకు అర్థ రూపాయికి అద్దెకు తీసుకుని నగరంలో తిరిగిన జాపకాలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారితో చాలా అనుబంధం ఉంది. అమ్మవారి ఆశీస్సులతో నాకు రెండు హిట్లు వచ్చాయి. ఇప్పుడు భోగి (Bhogi) మూడో హిట్ అయి హాట్రిక్ ఇస్తుందనిపిస్తుంది. ఇంత పెద్ద వైలెంట్ సినిమా నేనెప్పుడూ చేయలేదని తెలిపారు.
విజయవాడలోనే చదువుకున్నాను:
అనంతరం నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. నేను విజయవాడలోనే చదువుకున్నాను. విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం.. అందుకే 'భోగి' సినిమా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. సినిమాను టీం అందరం కలిసి కొత్తగా నిర్మించాం. నవంబరు 12న సినిమా విడుదలవుతోంది అందరూ తప్పకుండా చూడాలని కోరారు.
భోగి మొదటి ప్రమోషన్ విజయవాడే:
డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) మాట్లాడుతూ.. భోగి సినిమాకు మొట్టమొదటి ప్రమోషన్ విజయవాడ ఉత్సవ్ వేదిక అని అన్నారు. మద్రాసులో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు మొదట బెజవాడ టాక్ రావాల్సిందేనని సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది విజయవాడ నిర్ణయించేదని తెలిపారు. 1960 పీరియడ్‌లో జరిగిన అన్నా చెల్లెలకు సంబంధించిన రియల్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా ఇదని భీమ్స్ సంగీతం, చంద్రబోష్ సాహిత్యం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు.
శర్వానంద్ తిట్టుకుంటూ ఉంటాడు..-
ఎంపీ కేశినేని చిన్ని (MP Kesineni Chinni) మాట్లాడుతూ.. హీరో శర్వానంద్ నాకు మంచి మిత్రుడు. విజయవాడ అబ్బాయ్. ఒక విషయంలో నన్ను ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటాడు (నవ్వుతూ). గతంలో ఓమారు నాకు ఫోన్ చేసి ఒక కథ వినిపించాడు. నాకు ఆ కథ నచ్చలేదు, ఆ సినిమా వదిలేయ్ అని చెప్పడంతో నా మాట విని అలాగే వదిలేశాడు. ఆ తర్వాత ఆ సినిమాలో వేరే హీరో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి శర్వా నన్ను తిట్టుకుంటూ ఉంటాడు అని నాడు అన్నారు. 'శతమానం భవతి' చూసిన వెంటనే శర్వాకు ఫోన్ చేసి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పాను. సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న శర్వానంద్ సినిమాకు 'భోగి' అని పేరు పెట్టడంతో ఈ సినిమా హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాను. పాటలు చాలా బాగున్నాయన్నారు.