ఈ వారం థియేటర్లలో ఏడు సినిమాలు.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’పైనే ఆశలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 02:21 PM
అక్టోబర్ రెండో వారంలో తెలుగు థియేటర్లలో ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్‌తో పాటు బా బా బ్లాక్ షీప్, మయూఖ, చకోర, గుడ్ టైమ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అక్టోబర్ సెకండ్ వీకెండ్‌లోనూ సినిమాలు బాగానే సందడి చేయబోతున్నాయి. గత శుక్రవారం ఏకంగా పదకొండు సినిమాలు విడుదలైనా... ఏవీ కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. దాంతో అంతా ఈ వారం వచ్చే 'ఆదర్శ కుటుంబం'పై ఆశలు పెట్టుకున్నారు. తీరా అది కాస్తా వాయిదా పడిపోయింది. ఇక ఈ వారం వస్తున్న ఏడు సినిమాలలో కాస్తంత చెప్పుకోదగ్గది శ్రీవిష్ణు నటించిన 'కామ్రేడ్ కళ్యాణ్' ఒక్కటే. మహిమా నంబియార్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో రాధిక, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం వహించిన ఈ వినోద ప్రధాన చిత్రంలో శ్రీవిష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇది 1990 ప్రాంతంలో ఉత్తరాంధ్రలో జరిగే కథ. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. కోన వెంకట్ సమర్పణలో 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీని వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు.
ఈ శుక్రవారం రాబోతున్న చిత్రాలలో మరొకటి 'బా... బా.. బ్లాక్ షీప్'. ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయలోనే జరిగింది. 'కామ్రేడ్ కళ్యాణ్'లో కీలక పాత్ర పోషించిన ఉపేంద్ర లిమాయే ఈ సినిమాలోనూ ప్రధాన భూమిక పోషించారు. ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ మూవీలో ఇతర పాత్రలను టీనూ ఆనంద్, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ తదితరులు చేశారు. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ శుకవారం వస్తున్న మరో సినిమా 'మయూఖ'. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను శ్రీతేజ్ ఎస్.కె. దర్శకత్వంలో శశిధర్ నల్లా నిర్మించారు. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి., మురళీధర్ గౌడ్, లావణ్య రాణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ వీకెండ్‌లో వస్తున్న సినిమాలో మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ 'చకోర'. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ సినిమాను మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో డాక్టర్ చింతాడ హేమారావు ప్రొడ్యూస్ చేశారు. ఆల్వాల్ లో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి కథతో తెరకెక్కిన 'గుడ్ టైమ్' మూవీ సైతం శుక్రవారం వస్తోంది. నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. రమేశ్ జిల్లా నిర్మించిన ఈ సినిమాను చాణక్య జిల్లా డైరెక్ట్ చేశాడు. ఈ ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు ఈ శుక్రవారం తమిళ నుంచి 'సప్త సాగరాలు సప్త గిరులు' సినిమా వస్తోంది. సూరి, వివిన్ పౌల్, అంజలి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 1న తమిళనాడులో విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ఓ వారం ఆలస్యంగా ఈ సినిమాను తెలుగువారి ముందుకు తీసుకొస్తున్నారు. అలానే హిందీలో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న 'హనుమాన్ అంశ్' సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న 'హనుమాన్ అంశ్' సినిమా పంపిణీ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేపట్టింది. ఆ రకంగా ఐదు స్ట్రయిట్, రెండు అనువాద చిత్రాలు ఈ వీకెండ్‌లో తెలుగువారిని అలరించబోతున్నాయి.
తమిళంలో ఆరు సినిమాలు!
అక్టోబరు రెండో శుక్రవారం అంటే ఈ నెల 9వ తేదీ తమిళంలో ఆరు చిత్రాలు విడుదలకానున్నాయి. 15వ తేదీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్-2' విడుదల కానుండటంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా 9వ తేదీపైనే దృష్టి పెట్టారు. దాంతో 'ఆల్పాన్', 'ఈ 1', 'కిడ్డి', 'పరుందు', 'నోవా', 'తాడ్నిలమ్' చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే, ఈ వారం విడుదల కానున్న చిత్రాల్లో పెద్ద నటీనటుల చిత్రాలు లేకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
మంచి పాత్రలు రాకే.. మానేసి ఆ పని చేస్తున్నా: ఎల్.బి. శ్రీరామ్
Fauzi: ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం
మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా